హైదరాబాద్: దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణమే. అయితే గత ఎనిమిదేళ్లుగా ఇరు దేశాల మధ్య టోర్నీలేవీ జరగని సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరుగుందా? అని ఎదురుచూసే సగటు అభిమానికి నిజంగా ఇది శుభవార్తే.
ఇంతకీ ఆ శుభవార్త ఏంటంటే భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య త్వరలో క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నేరుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరిస్‌కు ప్రభుత్వం అంగీకరించడం లేదు.
దీంతో మూడు లేదా నాలుగు దేశాలను కలిపి ఓ టోర్నమెంట్‌గా నిర్వహించాలనే ఆలోచనలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు భారత్ లేదా ఓ తటస్థ వేదికపై ఈ టోర్నమెంట్‌ను నిర్వహించాలనే ఆలోచనలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 17వ తేదీన కొలంబోలో ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ కౌన్సిల్‌కు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇటీవలే దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరిగిన ఐసీసీ ఛీప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను నజాం సేథీ కలిశారు.
ఇక నజాం సేథీ పీసీబీలో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ హెడ్‌గా ఉన్న నజాం సేథీ ఈ సమావేశంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణకు ప్రయత్నించాలనే ఆలోచనలో పాక్ క్రికెట్ బోర్డు ఉన్నట్లు ఠాకూర్‌తో చర్చలు జరిపారని సమాచారం.
అయితే ఈ చర్చల్లో భాగంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ద్వైపాక్షిక సిరీస్ సాధ్యం కాదని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కుదరని చెప్పారు. అయితే మూడు లేదా నాలుగు దేశాల మధ్య టోర్నీ నిర్వహించేలా చూద్దామని చెప్పారు.
దీంతో డిసెంబర్ 17న జరగనున్న ఈ సమావేశం కోసం పాక్ క్రికెట్ బోర్డు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ సమావేశ ఏర్పాట్లకు సంబంధించి ఈ వారంలో ఇద్దరు అధికారులు పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్‌ను కలవనున్నారు. 2008లో ముంబై ఉగ్రదాడుల అనంతరం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగని సంగతి తెలిసిందే.