
అహ్మదాబాద్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నరేంద్ర మోడీ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో 13 బంతులు ఉండగానే మూడు వికెట్లు కోల్పయి ఛేదించింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (56; 32 బంతుల్లో 5x4, 4x6) ఆకట్టుకున్నాడు. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (73; 49 బంతుల్లో 5x4, 3x6) తన క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్‌లోనే మంగళవారం జరగనుంది.
ఇషాన్ కిషన్ మెరుపులు:
165 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కి ఆరంభంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. పేలవ ఫామ్‌ని కనబరుస్తూ డకౌట్‌గా వెనుదిరిగాడు. శామ్ కరన్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి వికెట్ కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అరంగేట్రం మ్యాచ్ అయినప్పటికీ స్వేచ్ఛగా షాట్లు ఆడిన మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. జోప్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, ఆదిల్ రషీద్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడు.
కోహ్లీ కోహ్లీ ఇన్నింగ్స్:
భారీ షాట్లు ఆడిన ఇషాన్ కిషన్.. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ఈ క్రమంలో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ వెంటనే రషీద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అనంతరం రిషబ్ పంత్ (26: 13 బంతుల్లో 2x4, 2x6) మెరుపులు మెరిపించి ఔట్ అయ్యాడు. చివర్లో శ్రేయాస్ అయ్యర్ (8 నాటౌట్)తో కలిసి దూకుడుగా ఆడిన కోహ్లీ.. ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. చివరలో ఫోర్, సిక్స్ బాది టీమిండియాకు విజయాన్ని అందించాడు.
ఆదుకున్న మలన్:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తొలి ఓవర్‌లోనే జోస్ బట్లర్ (0) ఔటైనా.. ఓపెనర్ జేసన్ రాయ్ (46; 35 బంతుల్లో 4x4, 2x6), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ (24; 23 బంతుల్లో 4x4)తో కలిసి ధాటిగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని యుజ్వేంద్ర చహల్ విడదీశాడు. మలన్‌ను చహల్ వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత జానీ బెయిర్‌స్టో (20; 15 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి రాయ్ మరింత ధాటిగా ఆడాడు.
మెరిసిన రాయ్, మోర్గాన్:
అయితే అర్ధ శతకానికి చేరువైన రాయ్‌ని ఓ అద్భుత బంతిరో వాషింగ్టన్ సుందర్ బోల్తా కొట్టించాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 91/3గా నమోదైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (28; 20 బంతుల్లో 4x4).. బెయిర్‌స్టోతో కలిసి బౌండరీలు బాదినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. సుందర్.. బెయిర్‌స్టోను, ఠాకుర్.. మోర్గాన్‌ను పెవిలియన్ పంపారు. చివర్లో బెన్ స్టోక్స్ (24), సామ్ కరన్ (6) ధాటిగా ఆడి జట్టు స్కోరును 164 పరుగులకు తీసుకెళ్లారు. ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసేలా కనిపించినా.. భువనేశ్వర్, శార్ధూల్ చివరలో కట్టడి చేశారు.