
చెన్నై: ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య చెన్నై చెపాక్ మైదానంలో మరికొద్ది సేపట్లో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోహ్లీసేన రెండో టెస్టులో మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ టెస్ట్ ఆరంగేట్రం చేస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ జట్టులోకి వచ్చాడు. షాబాజ్ నదీమ్ స్థానంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రాగా.. పేసర్ జస్ప్రీత్ బుమ్రా బదులుగా మొహ్మద్ సిరాజ్ ఆడుతున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది.
ఇంతకుముందు జరిగిన తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించి మ్యాచ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. ఈ క్రమంలోనే కోహ్లీ ఇప్పుడు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మంగళవారం చెపాక్ వేదికగానే ముగిసిన తొలి టెస్టులో 227 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది.
భారత జట్టుకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఈ సిరీస్‌లో నిలవాలన్నా, టెస్టు ఛాంపియన్‌షిప్ పోటీకి అర్హత సాధించాలన్నా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ఎలా ఆడనుందో వేచిచూడాలి. ఇక ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ వరుస డబుల్ సెంచరీలతో కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. అతడిని కట్టడి చేస్తే చాలు. కరోనా వైరస్ లాక్‌డౌన్ తర్వాత తొలిసారి స్టేడియంలోకి ప్రేక్షకుల్ని ఈ మ్యాచ్‌కి అనుమతించారు. అభిమానులు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధరించాలని తమిళనాడు క్రికెట్ అసోషియేషన్ సూచించింది. చెపాక్ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 50 వేలు కాగా.. 50% ప్రేక్షకుల్ని మ్యాచ్‌కి అనుమతించారు.
తొలి టెస్టుతో పోలిస్తే ఇప్పుడు భిన్నమైన పిచ్. మొదటి రోజు నుంచే స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. స్పిన్నర్లకు ఇది మంచి అవకాశం. ఇరు జట్లలో ముగ్గురేసి స్పిన్నర్లు ఉన్నారు. అయితే ఐదు రోజులు ఇలాంటి పిచ్ ఉండగలదా అనేది ఆసక్తికరం. ఈ నేపథ్యంలో టాస్ మరోసారి కీలకం కానుంది. మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు.
తుది జట్లు:
భారత్: రోహిత్, శుభ్‌మన్, పుజారా, కోహ్లీ (కెప్టెన్), రహానే, పంత్, అశ్విన్, అక్షర్, కుల్దీప్, ఇషాంత్, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్: సిబ్లీ, బర్న్స్, లారెన్స్, రూట్ (కెప్టెన్), స్టోక్స్, పోప్, ఫోక్స్, అలీ, బ్రాడ్, స్టోన్, లీచ్.