ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్ జట్టు చిత్తుగా ఓడించింది. భారత జట్టు 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకుంది. ఈ విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టీమిండియా ఆటగాళ్ల ఆట తీరు పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
షేక్ హ్యాండ్స్ వివాదం.. గంభీర్ కీలక ప్రకటన
మ్యాచ్ అనంతరం ఓ కొత్త వివాదం మొదలైంది. భారత జట్టు విజయం సాధించిన వెంటనే బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, శివం దూబే సహా ఏ ఇతర భారత ఆటగాడు కూడా పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో పాకిస్థాన్ జట్టు మైదానాన్ని విడిచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ఓ కీలక ప్రకటన చేశారు.

గౌతమ్ గంభీర్ ఏమన్నారంటే?
గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ఈ విజయం కేవలం ఒక మ్యాచ్‌లో గెలుపు మాత్రమే కాదని.. దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పహల్గాం దాడిలో అమరులైన వారి కుటుంబాలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా.. భారత సాయుధ బలగాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌కు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నామని పేర్కొన్నారు. దేశానికి ఎల్లప్పుడూ గర్వకారణంగా ఉండేలా జట్టు కృషి చేస్తుందని గౌతమ్ గంభీర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో భారత ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తి కన్నా దేశభక్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టమైంది. ఈ విజయం భారత జట్టుకు సూపర్ 4లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసింది.
మ్యాచ్ వివరాలు ఇలా..
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అత్యుత్తమంగా రాణించి 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి సునాయాసంగా గెలిచింది.