సెమీస్ బెర్తు రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. మహిళల టీ20 ప్రపంచకప్ -2024లో భాగంగా షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (54 నాటౌట్; 47 బంతుల్లో, 6 ఫోర్లు) పోరాడింది.
అయితే భారత్ సెమీస్ రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించలేదు. రేపు జరగనున్న పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంపై టీమిండియా సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 151 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (40; 41 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోరర్. స్టాండ్‌బై కెప్టెన్ తాహిలా మెక్‌గ్రాత్ (32; 26 బంతుల్లో, 4 ఫోర్లు), ఎలీసా పెర్రీ (32; 23 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించారు.

భారత బౌలర్లలో రేణుక సింగ్, దీప్తి శర్మ రెండు వికెట్లు, శ్రేయాంక, పూజ వస్త్రాకర్, రాధ యాదవ్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. ఛేజింగ్‌ను ఓపెనర్ షెఫాలీ వర్మ (20; 13 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆరంభించింది. కానీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయింది. స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన (6; 12 బంతుల్లో), జెమీమా రోడ్రిగ్స్ (16; 12 బంతుల్లో, 3 ఫోర్లు) నిరాశపరిచారు.
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దీప్తి శర్మ (29; 25 బంతుల్లో, 3 ఫోర్లు)తో కలిసి హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్స్ చక్కదిద్దింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 63 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడి క్రమంగా గేర్ మార్చి వేగంగా పరుగులు సాధించింది. అయితే జోరు మీదున్న దీప్తి ఔటవ్వడంతో భారత్ ఒత్తిడిలోకి వెళ్లింది. మరోఎండ్‌లో హర్మన్‌ప్రీత్ క్రీజులో ఉన్నప్పటికీ సహచరుల నుంచి సహకారం లభించలేదు. ఆఖరి ఓవర్‌లో భారత్ నాలుగు పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.