టీ20 వరల్డ్ కప్-2024లో సెమీస్ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆస్ట్రేలియా సెమీస్ బెర్తు సాధించుకుంటుందని క్రికెట్ నిపుణులు తొలుత అంచనా వేశారు. కానీ అఫ్గానిస్థాన్ అసాధారణ పోరాటంతో ఆస్ట్రేలియాపై విజయం సాధించి లెక్కలు తారుమారు చేసింది. కింగ్స్‌టౌన్‌లోని సెయింట్ విన్సెంట్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అఫ్గాన్ 21 పరుగుల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే.
మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 148 పరుగులు చేసింది. గుర్బాజ్ (60; 49 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. ప్యాట్ కమిన్స్ (3/28) హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్ మాక్స్‌వెల్ (59; 41 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడాడు. గుల్బాదిన్ నైబ్ (4/20) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.

ఆస్ట్రేలియాపై అఫ్గాన్ విజయం సాధించడంతో భారత్ సెమీస్ అవకాశాలపై పాక్షికంగా ప్రభావం చూపింది. అఫ్గాన్‌పై ఆస్ట్రేలియా గెలిచి ఉంటే టీమిండియా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించి ఉండేది. ఎందుకంటే అప్పుడు భారత్, ఆసీస్ మినహా అఫ్గాన్, బంగ్లాదేశ్ నాలుగు పాయింట్లు చేరే అవకాశమే ఉండేది కాదు. కానీ పరిస్థితి తారుమారైంది. బంగ్లా కూడా సెమీస్ రేసులో నిలిచింది.
అయితే సోమవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో ఓడితే నెట్‌రన్‌రేటుపై ఆధారపడాల్సి ఉంటుంది. +2.425తో ఉన్న టీమిండియా నాకౌటయ్యే ప్రమాదాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఆసీస్ చేతిలో ఘోర పరాజయం, బంగ్లాఫై అఫ్గాన్ ఘన విజయం సాధిస్తే రోహిత్ సేన ఇంటిముఖం పట్టాల్సిందే. భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ నాలుగు పాయింట్లతో సూపర్-8ను ముగించిన సందర్భంలో.. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించాలంటే...
టీమిండియాపై ఆస్ట్రేలియా 41 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో విజయం సాధించాలి. మరోవైపు బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్థాన్ 83+ పరుగుల తేడాతో నెగ్గాలి. అప్పుడే భారత్ కంటే ఆసీస్, అఫ్గాన్ మెరుగైన రన్‌రేటు సాధించగలడు. ఆ సందర్భంలో మాత్రమే రోహిత్ సేన సెమీస్ క్వాలిఫై కాకుండా టోర్నీ నుంచి ఔట్ అవుతుంది.