జింబాబ్వే పర్యటనలో భారత్ మరో సమరానికి సిద్ధమైంది. హరారె వేదికగా బుధవారం మూడో టీ20 ఆడనుంది. తొలి టీ20లో అనూహ్య పరాజయం చవిచూసిన టీమిండియా.. రెండో టీ20లో పంజా విసిరింది. ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ ఆల్‌రౌండ్‌షోతో జింబాబ్వేతను చిత్తుగా ఓడించింది. అదే వేదికగా జరగనున్న రేపటి మ్యాచ్‌లో కూడా విజయం సాధించి అయిదు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని శుభ్‌మన్ గిల్ బృందం పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
ప్రస్తుతం భారత్-జింబాబ్వే 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే భారత్ నయా కోచ్ శుభ్‌మన్ గిల్, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు కొత్త తలనొప్పి మొదలైంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు సభ్యులు శివమ్ దూబె, సంజు శాంసన్, యశస్వీ జైస్వాల్ తిరిగి జట్టుతో చేరడంతో తుదిజట్టు కూర్పును సిద్ధం చేయడం వాళ్లకు కఠిన సవాలుగా మారింది. వాళ్ల రాకతో విన్నింగ్ టీమ్‌ను కాంబినేషన్ మార్చాల్సి వస్తుంది.

టీ20 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడే జింబాబ్వే పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శివమ్ దూబెను హార్దిక్ పాండ్యలా స్టార్ ఆల్‌రౌండర్‌గా మార్చాలని, అతనికి విశ్రాంతి ఇవ్వకుండా జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేసింది. అలానే బెంచ్‌కే పరిమితమైన యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్‌ను కూడా రాటు తేల్చాలని పర్యటనకు ఎంపిక చేసింది. కానీ వెస్టిండీస్‌లో తుఫాను కారణంగా ఈ ముగ్గురు ఆలస్యంగా స్వదేశానికి చేరడంతో తొలి రెండు టీ20లకు ప్రత్యామ్నాయ ఆటగాళ్లను జింబాబ్వేకు పంపింది.
అయితే ఈ ముగ్గురులో యశస్వీ జైస్వాల్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. రెండో టీ20లో సెంచరీతో రికార్డులు షేక్ చేసిన అభిషేక్ శర్మను, క్లాసిక్ ఇన్నింగ్స్‌తో విశ్వరూపం చూపించిన రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టులో కొనసాగిస్తారు. ఇక కెప్టెన్ గిల్ జట్టులో ఉండటం తప్పనిసరి. దీంతో టాప్ ఆర్డర్‌ను మార్చలేని పరిస్థితి ఎదురుకావడంతో జైస్వాల్ తుదిజట్టులో చోటు దక్కడం కష్టమే.
మరోవైపు సంజు శాంసన్, శివమ్ దూబె తుది జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది. అయితే రియాన్ పరాగ్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే దూబె, శాంసన్ బెంచ్‌కే పరిమితమవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సుదర్శన్ లేదా పరాగ్ ఒక్కరిని తప్పించినా దూబె జట్టులోకి వచ్చేస్తాడు. అలాగే వికెట్‌కీపర్ ధ్రువ్‌ను పక్కనపెడితే శాంసన్ బరిలోకి దిగుతాడు. బౌలింగ్‌లో ఎలాంటి మార్పులు లేవు.
జింబాబ్వేతో మూడో టీ20కి భారత తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, సాయి సుదర్శన్/శివమ్ దూబె, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్/సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ముకేశ్ కుమార్.