ముంబై: వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో స్వదేశం వేదికగా ఇంగ్లండ్‌తో భారత్ ఆడే సిరీస్ షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకొంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ పర్యటనలో ఇంగ్లండ్‌తో భారత్ ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాలి. అయితే, తాజా మార్పు ప్రకారం ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు జరుగుతాయని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మంగళవారం వెల్లడించాడు. టెస్ట్ సిరీస్‌లను కుదించి ఆ స్థానంలో టీ20లు పెంచారు.
వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు జట్లే ఉంటాయి కాబట్టి ఈ సిరీస్ నిర్వహణ తమకు సులువు అవుతుందని గంగూలీ తెలిపాడు. అదే టైమ్‌లో కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉంటామన్నాడు. అలాగే, వచ్చే ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని పునరుద్ఘాటించాడు.
కాగా.. గత నాలుగున్నరనెలల్లో 22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నానని, ఒక్క సారి కూడా పాజిటివ్ రాలేదని దాదా తెలిపాడు. కోహ్లీసేన ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో అక్కడికి చేరిన బీసీసీఐ బాస్.. మంగళవారం క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టేందుకు భారత ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారని తెలిపాడు.