ఉత్కంఠకు తెరపడింది. టీ20 వరల్డ్ కప్‌లో బరిలోకి దిగే భారత జట్టు తెలిసిపోయింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. అయితే మరో కొత్త సమస్య మొదలైంది. సెలక్టర్లు సాహసోపేతమైన నిర్ణయాలకు వెళ్లకుండా ఫేవరేట్ ప్లేయర్లను సెలక్ట్ చేయడంతో జట్టు కూర్పు తలనొప్పిగా మారే పరిస్థితులు తలెత్తాయి.
జట్టులో స్థానాలకు తగ్గట్లుగా కాకుండా స్టార్ ప్లేయర్లను సెలక్ట్ చేయడంతో మిడిల్ ఆర్డర్-లోయర్ ఆర్డర్ కూర్పు గందరగోళంగా మారింది. అలాగే ఫామ్‌లో లేని మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్‌లను ఎంపిక చేయడంతో భారత పేస్ దళం బలహీనంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో సిరాజ్, అర్షదీప్ ధారాళంగా పరుగులు ఇస్తున్న విషయం తెలిసిందే.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్; వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌తో టాప్-4 బలోపేతంగా కనిపిస్తోంది. ఈ నలుగురు కుదురుకుంటే మిగిలిన బ్యాటర్లకు ఎలాంటి పని ఉండదు. ఎడమచేతి వాటం రిషభ్ పంత్ అయిదో స్థానంలో వస్తాడు. ఆ తర్వాత ఎవరు వస్తారనేది అసలు ప్రశ్న.
తుది జట్టులో స్థానం కోసం సంజు శాంసన్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పేస్ కూడా వేసే హార్దిక్ జట్టుకు అదనపు బలంగా మారే అవకాశం ఉండటంతో అతని ఎంపిక దాదాపు ఖరారే. ఇక తుదిజట్టులో పంత్ ఉండటంతో శాంసన్‌కు నిరాశే మిగులుతుందని అనుకోవచ్చు. దీంతో దూబె ఛాన్స్ దక్కించుకోవచ్చు. కానీ దూబె ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు?
ఐపీఎల్‌లో, అంతకుముందు జరిగిన అఫ్గానిస్థాన్ సిరీస్‌లో దూబె నాలుగో స్థానంలో వచ్చాడు. భారత జట్టులో అయిదో స్థానం వరకు ఖరారు అవ్వడంతో దూబె ఆరు లేదా ఏడో స్థానాల్లోనే బ్యాటింగ్‌కు రావాలి. కానీ తనకు అలవాటు లేని ఫినిషర్ పాత్రలో దూబె ఎంతమేరకు రాణిస్తాడు? ఆ స్థానాల్లో రింకూ సింగ్‌కు మంచి రికార్డు ఉంది. కానీ అతడు జట్టులో లేడు. ఫామ్‌లో ఉన్న దూబెను జట్టులో బలవంతంగా కొనసాగించాలని భావిస్తే భారత జట్టు కూర్పు చెడిపోతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడం హార్దిక్‌కు అలవాటే. అయితే స్పిన్ ఆల్‌రౌండర్‌గా జడేజా/ అక్షర్ పటేల్‌లో ఒకరు తుది జట్టులోకి వస్తారు. దీంతో అయిదో స్థానం నుంచి ఎనిమిదో స్థానం వరకు భారత్ పంత్, దూబె, జడేజా/అక్షర్ పటేల్ వంటి ముగ్గురు ఎడమ చేతి వాటం బ్యాటర్లతో బరిలోకి దిగాల్సి వస్తుంది. ఇది టీమిండియాకు వరంగా మారుతుందా? లేదా శాపంగా మారుతుందా? అని తెలియాలంటే మరో నెల రోజులు ఎదురుచూడాలి.
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్
టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.