
ముంబై: భారత్ క్రికెట్ జట్టు-ఏ టీమ్ దక్షిణాఫ్రికా పర్యటన మొదలు పెట్టింది. సఫారీ గడ్డపై అడుగు పెట్టింది. రెడ్ బాల్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఏ టీమ్‌తో మూడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఈ పర్యటనకు ప్రియాంక్ పంచాల్ సారథ్యాన్ని వహిస్తున్నాడు. టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి ఇదివరకే జట్టులో చేరాడు. ఇప్పుడు తాజాగా ఐపీఎల్ ప్లేయర్లు ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ కూడా దక్షిణాఫ్రికా విమానం ఎక్కనున్నారు. ఈ సాయంత్రం కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో న్యూజిలాండ్‌తో తలపడే జట్టులో వారిద్దరూ టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉంది.
శార్దుల్ ఠాకూర్ కూడా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లొచ్చని తెలుస్తోంది. ఈ పర్యటన కోసం మొత్తం 14 మందితో కూడిన భారత్-ఏ జట్టును చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఇదివరకే ఎంపిక చేశారు. ప్రియాంక్ పంచాల్ కేప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టులో హనుమ విహారి, ఉపేంద్ర యాదవ్, నవ్‌దీప్ సైనీ, ఉమ్రాన్ మాలిక్, ఇషాన్ పొరెన్, అర్జాన్ నగ్వస్‌వాలా ఎంపికయ్యారు. ఇషాన్ కిషన్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్.. జట్టుతో కలుస్తారు. టీమిండియా-ఏలో ఇషాన్ కిషన్.. రెండో వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తాడు.
ఈ సిరీస్ కోసం ఫుల్ టైమ్ వికెట్ కీపర్‌గా ఉపేంద్ర యాదవ్ సెలెక్ట్ అయ్యాడు. దక్షిణాఫ్రియా-ఏ టీమ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సిందీ జట్టు. ఇవన్నీ నాలుగు రోజుల పాటు సాగే మ్యాచ్‌లు. బ్లూయెమ్ ఫౌంటెన్‌లోనే ఈ మ్యాచ్‌లన్నీ కొనసాగుతాయి. తొలి మ్యాచ్ ఎల్లుండి ఆరంభమౌతుంది. ఈ నెల 29, డిసెంబర్ 6 తేదీల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లను షెడ్యూల్ చేశారు. ఈ జట్టుకు హెడ్ కోచ్‌గా శితాన్షు కోటక్ వ్యవహరిస్తున్నాడు.
బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులె, ఫీల్డింగ్ కోచ్‌గా టీ ఘోష్ పని చేస్తోన్నారు. నేషనల్ క్రికెట్ అకాడమీకి చెందిన తుల్సీ రామ్ ఫిజియోథెరఫిస్ట్‌గా ఉంటారు. నిజానికి- దీపక్ చాహర్, ఇషాన్ కిషన్ భారత్-ఏ జట్టుతో పాటు దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. న్యూజిలాండ్‌తో సిరీస్ ఉన్నందున ఆగిపోయారు. వారిద్దరూ ఈ సాయంత్రం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే చివరి టీ20 మ్యాచ్ కోసం తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు.