
ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు అరుదైన ఘనతను సాధించనుంది. ఏడేళ్ల తరువాత తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్న మిథాలీ రాజ్ జట్టు.. ఇంగ్లీష్ టీమ్‌తో ఓ టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఒకవంక కోహ్లీసేన.. మరో వంక విమెన్స్ టీమ్ ఒకేసారి ఇంగ్లాండ్‌లో పర్యటించబోతోండటం ఆసక్తి రేపుతోంది. ఎవరి సత్తా ఎలాంటిదో నిర్ధారించే టూర్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు క్రికెట్ ప్రేమికులు.
ఆ ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు సంబంధించిన కొత్త జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విడుదల చేసింది. కేప్టెన్ మిథాలి రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, ఝులన్ గోస్వామి, స్మృతి మంధాన దీన్ని ఆవిష్కరించారు. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటోంది. జూన్ తొలివారంలో ఇంగ్లాండ్ విమానం ఎక్కుతుంది. బ్రిటన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మరో మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. ఆ తరువాతే ఫీల్డ్ లోకి అడుగు పెడుతుందా జట్టు.
ఇంగ్లాండ్‌తో మిథాలీరాజ్ టీమ్.. ఆడబోయే తొలిటెస్ట్ మ్యాచ్ జూన్ 16వ తేదీన ఆరంభమౌతుంది. బ్రిస్టల్ స్టేడియం దీనికి వేదికగా మారింది. ఏడేళ్ల తరువాత విమెన్స్ టీమ్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోండటం ఇదే తొలిసారి. ఆ తరువాత మూడు వన్డే ఇంటర్నేషనల్స్, మూడు టీ20 మ్యాచ్‌లు ఆరంభమౌతాయి. బ్రిస్టల్, టౌంటన్, వర్సెస్టర్, నార్థాంప్టన్, బ్రైటన్, ఛెమ్స్‌ఫోర్డ్‌లల్లో ఈ మ్యాచ్‌లు సాగుతాయి. టెస్ట్ ఫార్మట్‌కు మిథాలి రాజ్ సారథ్యాన్ని వహిస్తారు. వన్డే, టీ20 ఫార్మట్లకు హర్మన్ ప్రీత్ కౌర్ కేప్టెన్‌గా వ్యవహరిస్తారు.
ఆ ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం బీసీసీఐ కొత్త జెర్సీని విడుదల చేసింది. దీన్ని ధరించడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఏడేళ్ల తరువాత టెస్ట్ మ్యాచ్ ఆడబోతోండటం ఎగ్జయిటింగ్‌గా ఉందని చెప్పారు. 2009లో భారతజట్టులో చోటు దక్కించుకున్న ఆమె ఇంత సుదీర్ఘ కేరీర్‌లో ఆడింది రెండు టెస్టులే. అయిదు రోజుల పాటు ఏకధాటిగా సాగే టెస్ట్ ఫార్మట్‌లో మళ్లీ అడుగు పెట్టడబోతున్నానని చెప్పారు. కొత్త జెర్సీతో కనిపించారామె.
అదే సమయంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా కూడా ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. మహిళ క్రికెట్ జట్టు టెస్ట్‌మ్యాచ్ ఆరంభమైన రెండోరోజు అంటే.. జూన్ 18వ తేదీన సౌథాంప్టన్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆరంభమౌతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు.. న్యూజిలాండ్‌ను ఢీ కొట్టనుంది. దీని తరువాత- ఇంగ్లాండ్ టీమ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆరంభమౌతుంది. తొలి టెస్ట్ ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు సాగే సుదీర్ఘ షెడ్యూల్ ఇది.