
హైదరాబాద్: క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ ఆట మొదలెట్టేసింది. మంగళవారం ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియం వేదికగా ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్స్ మొదలుపెట్టింది. కేవలం అందుబాటులో ఉన్న స్వదేశీ క్రీడాకారులతో రాయల్స్ మంగళవారం ముంబైలో మూడు రోజుల సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
అండర్ 19 జట్టు నుంచి ఎంపికైన ఆర్యమన్ విక్రమ్ బిర్లా, మిథున్, మహిపాల్ లొమ్రార్ తదితరులు ప్రాక్టీసులో పాల్గొన్నారు. మధ్యలో రహానె కూడా వచ్చి ఆటగాళ్లకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ ఏప్రిల్ 7న ప్రారంభంకానుంది. రెండేళ్ల నిషేధం తర్వాత 11వ సీజన్‌లో పునరాగమనం చేస్తోన్న రెండు జట్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్. దీంతో రాయల్స్ ఈ సీజన్ ఐపీఎల్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆచూతూచి అడుగులు వేస్తోంది.
మాజీ ఆటగాడు షేన్ వార్న్‌కు మెంటార్ బాధ్యతలు అందించింది. వార్న్ నాయకత్వంలోని రాయల్స్ జట్టు ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కు స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా తీసుకోనున్నట్లు సమాచారం.
ప్లేయర్ రిటెన్షన్‌లో ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్‌ను మాత్రమే దక్కించుకున్న రాయల్స్ వేలంలో రహానె, స్టోక్స్, బట్లర్‌తో పాటు పలువురు కీలక ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ తన తొలి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఏప్రిల్ 9న హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.