హైదరాబాద్: 2018 నుంచి 2022 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కులను స్టార్ ఇండియా సొంతం చేసుకుంది. ఇందు కోసం గాను బీసీసీఐకి స్టార్ ఇండియా రూ. 16,347 కోట్లను చెల్లించనుంది. దీంతో ఐదేళ్ల పాటు ఐపీఎల్‌కు సంబంధించిన మీడియా, డిజిటల్ కార్యక్రమాలను స్టార్ ఇండియా ప్రసారం చేసుకునే సౌకర్యం కలిగింది.
ఇందులో భాగంగా ఏడాదికి రూ. 3,270 కోట్ల చొప్పన స్టార్ ఇండియా ఐదేళ్ల కాలానికి 16 వందల కోట్ల రూపాయలకు పైగా బీసీసీఐకి చెల్లించనుంది. ఈ సందర్భంగా స్టార్ ఇండియా ఛైర్మన్, సీఈఓ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా దాదాపు రూ. 20 వేల కోట్లు వస్తాయని బీసీసీఐ అంచనా వేసింది. అయితే, చివరకు రూ. 16,347 కోట్లకు స్టార్ ఇండియా ప్రసార హక్కులను సొంతం చేసుకుంది.
భారత్‌లో డిజిటల్, ఇంటర్నెట్ మాధ్యమాల ద్వారా ప్రసారం కోసం ఎక్కువ బిడ్ వేసిన సంస్థలుగా రిలయన్స్ జియో, టైమ్స్ ఇంటర్నెట్, ఎయిర్‌టెల్, ఫేస్‌బుక్ నిలిచాయి. టీవీ ప్రసార హక్కుల కోసం సోనీ, స్టార్ ఇండియాలు అధికంగా బిడ్ చేశాయి. బిడ్లు వేసిన 14 కంపెనీల్లో బామ్‌టెక్, బెయిన్ స్పోర్ట్స్ సంస్థలను కొన్ని సంస్థాగత కారణాల వల్ల ఐపీఎల్ ప్రసారానికి అనర్హులుగా ప్రకటించారు.
ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల కోసం బీసీసీఐ సోమవారం వేలం నిర్వహించింది. ఈ వేలంలో 2018 నుంచి 2022 కాలపరిమితికి మీడియా హక్కులను బ్రాడ్‌కాస్ట్, డిజిటల్ రైట్స్ అనే రెండు కేటగిరీల్లో వేలం వేశారు. ఈ ప్రసార హక్కుల కోసం సుమారు 24 కంపెనీలు ఆసక్తి ప్రదర్శించాయి. ప్రధాన పోటీ మాత్రం స్టార్, సోనీ మధ్యేనని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.

ఐపీఎల్ హక్కుల కోసం చాలా పెద్ద మొత్తంలో చెల్లించేందుకు చాలా పేరున్న కంపెనీలు పాల్గొన్నాయి. 2008లో పదేళ్ల కాలానికి సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ రూ. 8200 కోట్లు చెల్లించింది. ఆన్‌లైన్ మీడియా ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో చాలా కంపెనీలు డిజిటల్ హక్కుల కోసం బరిలో నిలిచాయి.
మూడేళ్ల కాలపరిమితితో గ్లోబల్ డిజిటల్ హక్కుల కోసం 2015లో నోవీ డిజిటల్ రూ. 302.2 కోట్లు చెల్లించింది. ఇక, భారత ఉపఖండంలో డిజిటల్ హక్కుల కోసం రిలయన్స్ జియో డిజిటల్, ఎయిర్‌టెల్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
పోటీలో ఉన్న ప్రముఖ సంస్ధలు:
* స్టార్ ఇండియా
* అమెజాన్ సెల్లర్ సర్వీసెస్
* ఫాలోఆన్ ఇంటరాక్టివ్ మీడియా
* తాజ్ టీవీ ఇండియా
* సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్
* టైమ్స్ ఇంటర్నెట్
* ట్విటర్
* ఫేస్‌బుక్
* యుప్ టీవీ
* డిస్కవరీ
* ఓత్ (యాహూ)
* ఎయిర్‌టెల్
* గ్రూప్ ఎం మీడియా
* స్కై యూకే
* ఈఎస్‌పీఎన్ డిజిటల్ మీడియా
* సూపర్‌స్పోర్ట్ ఇంటర్నేషనల్
* రిలయన్స్ జియో డిజిటల్