రాజ్‌కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రైజింగ్ పుణె జెయింట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో మూడు వేల పరుగుల మార్కును చేరిన ఆటగాళ్ల జాబితాలో ధోని స్థానం సంపాదించాడు.
ఐపీఎల్-9లో భాగంగా గురువారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్బంగా ధోని 10 బంతుల్లో 22 పరుగులు చేశాడు. తద్వారా మూడు వేల పరుగుల మార్కును చేరిన ఏడో ఆటగాడిగా ధోని(3,010) రికార్డులకెక్కాడు.
ఇప్పటివరకూ 131 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోని.. 117 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనతను సాధించాడు. అంతకుముందు ఈ జాబితాలో సురేష్ రైనా(3,743), రోహిత్ శర్మ(3,476), గౌతం గంభీర్(3,235), విరాట్ కోహ్లి(3,212), క్రిస్ గేల్( 3,200), రాబిన్ ఉతప్ప(3,039)లు ఉన్నారు.

కాగా, యావరేజ్‌లో మాత్రం ధోని(సుమారు 40.00) రెండో స్థానంలో ఉండగా, గేల్ (47.62) తొలిస్థానంలో నిలిచాడు. మరోవైపు గురువారం నాటి మ్యాచ్‌లో సురేష్ రైనాను ధోని స్టంపింగ్ చేసి దినేష్ కార్తీక్ సరసన నిలిచాడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం 24 స్టంపింగ్‌లతో సమంగా ఉన్నారు.
అంతేగాక, ఐపీఎల్లో విజయవంతమైన సారథిగా ధోనీ కొనసాగుతున్నాడు. ఆడిన 8 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును రెండు సార్లు విజేతగా నిలబెట్టాడు. మరెన్నో టైటిళ్లను తన సొంతం చేసుకున్నాడు.