మెల్బోర్న్: భారత ట్వంటీ 20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే ద్వారా అరుదైన రికార్డ్ సృష్టించాడు. తాజా మ్యాచ్ ద్వారా ధోనీ అంతర్జాతీయ క్రికెట్లో 300వ మ్యాచ్ కెప్టెన్‌గా మైలురాయి చేరుకున్నాడు.
ధోనీ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఉన్నాడు. ఇలా వికెట్ కీపర్‌గా ఉంటూ 300వ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాడు ధోనీ మాత్రమే. సారథిగా 300వ మ్యాచ్‌ల మైలురాయి అందుకున్న మూడో వ్యక్తి ధోనీ. ఇంతకుముందు రికీ పాంటింగ్ 324 (ఆస్ట్రేలియా), స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ (న్యూజిలాండ్) 303తో ముందున్నారు.

భారత క్రికెటర్లకు క్యాసినోలకు నో ఎంట్రీ
భారత క్రికెటర్లను క్యాసినోలకు (విహారం కోసం) అనుమతించడాన్ని బిసిసిఐ బ్యాన్ చేసింది. బ్రిస్బేన్‌లో జరిగిన 2వ వన్డే తర్వాత భారత జట్టుకు ఈ విషయమై సమాచారం అందింది. బిసిసిఐ అధ్యక్షులు శశాంక్ మనోహర్, బోర్డ్ సెక్రటరీ అనురాగ్ ఠాకుర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలుస్తోంది.
ఆసిస్ పర్యటనలో ఉన్న మన ఆటగాళ్లు తెలియకుండానైనా తప్పుడు పనులు చేసే వారిని కలవకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారని చెబుతున్నారు. భారత్ ఆటగాళ్లు జనవరి 31వ తేదీ వరకు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంటారు.