
దుబాయ్: నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన చివరిదైన మూడో టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఈ టీ20 సిరీస్‌లో 8 వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు అందుకున్న టీమిండియా పేసర్ దీపక్ చహర్ తన టీ20 ర్యాంక్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు.
సోమవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దీపక్ చహర్ 42వ స్థానంలో నిలిచాడు. చివరి టీ20లో హ్యాట్రిక్‌తో సహా 6 వికెట్లు పడగొట్టడంతో చహర్ ఒకేసారి 88 స్థానాలను ఎగబాకాడు. ఇది చహర్‌కు అత్యుత్తమ టీ20 రాంక్. అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బౌలింగ్ విభాగంలో టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ఉన్నాడు.
బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఏడో స్థానాన్ని కాపాడుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో తృటిలో సెంచరీని మిస్సైన రోహిత్ శర్మ ఈ సిరిస్‌లో మొత్తం 96 పరుగులు చేశాడు. ఫలితంగా టీ20ల్లో తన ర్యాంకుని మరింతగా మెరుగుపరుచుకున్నాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారత బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ టెస్టుల్లో 10వ ర్యాంకులో, వన్డేల్లో రెండో ర్యాంకులో, టీ20ల్లో 7వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
కేఎల్ రాహుల్ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్ టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ క్రికెటర్ మహ్మద్ నబీ తొలిసారి నంబర్ వన్ స్థానాన్ని సాధించాడు. ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రస్తుతం క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం ప్రకటించడంతో అగ్రస్థానం నబీకి దక్కింది. జట్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. భారత్ ఐదవ స్థానంలో ఉంది.