సిడ్నీ: ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో జన్మించిన భారత సంతతికి చెందిన యువ స్పిన్నర్ అర్జున్ నాయర్ న్యూసౌత్ వేల్స్(ఎన్ఎస్‌డబ్ల్యూ) జట్టుకు ఎంపికయ్యాడు. అతడు త్వరలో దక్షిణ ఆస్ట్రేలియాతో జరగబోయే షెఫీల్డ్ షీల్డ్ మ్యాచులో ఆడనున్నాడు.
17ఏళ్ల ఈ బౌలర్ ఖచ్ఛితమైన దూస్రా వేయగలడు. ఈ నేపథ్యంలో గురువారం ది రెడ్‌బక్స్‌తో కాఫ్స్ హార్బర్‌లో జరిగే మ్యాచు కోసం ఎన్ఎస్‌డబ్ల్యూ జట్టు ఎంపిక జరిగింది. ఈ జట్టులో అతడ్ని ఎంపిక చేసినట్లు ది బ్లూస్ సెలెక్టర్లు ఆదివారం నాయర్‌కు తెలిపారు.
వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరేన్ మాదిరిగానే నాయర్ కూడా బంతిని రెండు వైపులా తిప్పగలడు. నాయర్ ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు ఎన్ఎస్ డబ్ల్యూ జట్టుకు ఎంపిక చేశారు. 'నాయర్‌లో ఎంతో ప్రతిభ ఉంది' అని ఎన్ఎస్‌డబ్ల్యూ కోచ్ ట్రెంట్ జాన్‌స్టన్ మీడియాకు తెలిపారు.

'ఎన్ఎస్‌డబ్ల్యూ వర్సెస్ క్వీన్స్‌లాండ్ స్కూల్ బాయ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా నేను నాయర్ ఆటను చూశాను. వెంటనే ఫ్రెడ్డీ(ఎన్ఎస్‌డబ్ల్యూ స్టేట్ టాలెంట్ మేనేజర్ డేవిడ్ ఫ్రీడ్‌మాన్)కి చెప్పాను. 'అతనేం చేస్తాడో నాకు తెలియదు. అతడు నా(ఎన్ఎస్‌డబ్ల్యూ) 19త టీంలో ఉండాలి. రెండు వైపులా బంతిని తిప్పగల ప్రతిభను అతడు ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు గానీ, అతడు మాత్రం రాబోయే కాలం పెద్ద బౌలర్ అవుతాడు' అని తెలిపారు. నాయర్ తొలి గ్రేడ్ మ్యాచులో హాక్స్‌బురి తరపున 15ఏళ్ల వయస్సులో తొలి మ్యాచ్ ఆడాడు.
గత ఏడాది నుంచి నాయర్ బంతితోనే కాకుండా బ్యాటుతోనూ రాణిస్తున్నాడు. ఇటీవల న్యూజిలాండ్, పాకిస్థాన్, దుబాయ్ జట్లతో జరిగిన ముక్కోణపు అండర్-19 సిరీస్‌లో 10 వికెట్లు తీసిన నాయర్.. 89 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఇటీవల ఏసిటి జరిగిన ఫ్యూచర్ లీగ్‌లో 39.5 ఓవర్లలో 75 పరుగులిచ్చి 9 వికెట్లు తీసి అత్యుత్తమంగా రాణించాడు.