
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 2(శనివారం) నుంచి ప్రారంభం కానుంది. కాగా, ఇరు జట్ల మధ్య ఐదు రోజులు జరగాల్సిన రెండో టెస్టు నాలుగు రోజులకే ముగిసింది. రెండో టెస్టులో కోహ్లీసేన ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
దీంతో మూడో టెస్టు ప్రారంభానికి నాలుగు రోజులు సమయం ఉండటంతో టీమిండియా ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన సహచర ఆటగాడు విజయ్ శంకర్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్‌కు వెళ్లాడు.
దీనికి సంబంధించిన ఫోటోలను అశ్విన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. 'ఈ రోజు ఉదయం గొప్పగా మొదలైంది. పెంచ్ టైగర్ రిజర్వ్‌లో సఫారీ చేశాం. ప్రకృతి, అటవీ సౌందర్యం ఎంతో ఆహ్లాదంగా ఉంది' అని అశ్విన్ కామెంట్ పోస్టు చేశాడు.
రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కోహ్లీ మొత్తం 8 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. తద్వారా టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్ అగ్రస్ధానంలో నిలిచాడు. రెండో టెస్టులో చివరి బ్యాట్స్‌మన్ గమాగె (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి అశ్విన్ రికార్డుని నెలకొల్పాడు.
ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు 8 వికెట్ల దూరంలో ఉన్న అశ్విన్... తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఈ రికార్డును సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అస్ట్రేలియా పేస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ పేరిట ఉంది. డెన్నిస్ ఈ ఘనతను 56 మ్యాచుల్లో సాధించగా.. అశ్విన్ కేవలం 54 మ్యాచ్‌ల్లోనే సాధించడం విశేషం.