
ఇండోర్: భారతదేశపు తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చంద్ర నాయుడు కన్నుమూశారు. ఆమె వయసు 88. గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న చంద్ర నాయుడు ఇండోర్‌లోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం మరణించారు. మాజీ క్రికెటర్ సీకే నాయుడు కుమార్తెనే ఈ చంద్ర నాయుడు. క్రికెట్ వ్యాఖ్యానంతో పాటు ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించిన ఆమె.. 50వ దశకంలో జాతీయ జట్టు తరఫున క్రికెట్ ఆడారు.
గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఉండి చికిత్స తీసుకుంటున్న చంద్ర నాయుడు ఇవాళ మధ్యాహ్నం కన్నుమూసినట్లు ఆమె సోదరి కుమారుడు విజయ్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇండోర్‌లోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా ఆమె పనిచేశారు. హోల్కర్ కాలేజీలో చదువుతున్నప్పుడు 50వ దశకంలో క్రికెట్ ఆడారు. ఆ రోజుల్లో మహిళల క్రికెట్‌కు అంతగా ప్రాముఖ్యత లేని కారణంగా.. కామెంటరీపై దృష్టి సారించి భారతదేశపు తొలి మహిళా వ్యాఖ్యాతగా రికార్డుల్లోకెక్కారు.
క్రికెట్ పట్ల చంద్ర నాయుడుకు ఉన్న ఆసక్తి ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో బీసీసీఐ, ఐసీసీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. 80వ దశకంలో తన తల్లి జ్ఞాపకార్థం ట్రోఫీని విరాళంగా ఇవ్వడం ద్వారా మహిళల ఇంటర్-యూనివర్శిటీ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రవేశపెట్టారు. ఎంపీసీఏలో చురుకైన సభ్యురాలుగా ఉండి అనేక కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
లార్డ్స్ మ్యూజియానికి తన తండ్రి సీకే నాయుడు వినియోగించిన క్రికెట్ బ్యాట్ అందజేత సమయంలో లార్డ్స్ కామన్ రూమ్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి పొందిన ఏకైక మహిళగా చంద్ర నాయుడు నిలిచారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు చంద్ర నాయుడు చురుకుగా ఉండి.. బీసీసీఐ, సీసీఐ, ఎంపీసీఏ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆమె మృతి పట్ల మాజీ క్రికెటర్, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ జగ్దలే తీవ్ర విచారం వ్యక్తం చేశారు.