హైదరాబాద్: తన భార్య హసిన్ జహాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తీవ్ర విమర్శలకు గురైన టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీకి మాజీ క్రికెటర్లు బాసటగా నిలిచారు. డిసెంబర్ 23న తన భార్య హసిన్ జహాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోలను షమీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.
భార్య స్లీవ్ లెస్ గౌను: ఫ్యాన్స్‌కు షమీ దిమ్మదిరిగే సమాధానం
ఫోటోల కింద సంతోషంగా గడిపిన క్షణాలు అంటూ కామెంట్ పెట్టాడు. ఆ ఫోటోలో హసిన్ జహాన్ స్లీవ్ లెస్ గౌను ధరించి ఉంది. అయితే ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ ముస్లిం అయివుండి ఇలా స్లీవ్‌లెస్ వేసుకోవడం మంచి పద్దతి కాదని, ఆమెను ముస్లింలా పరదాలో ఉంచాలంటూ పలువురు కామెంట్ చేశారు.

'నువ్వు చేసుకున్నది ముస్లింనా? లేక హిందువునా?' అని కూడా ప్రశ్నించారు. కొందరు అతనికి తన మతం గురించి కూడా గుర్తు చేశారు. నీ భార్య ఎందుకు ముసుగు ధరించలేదు అని కూడా ప్రశ్నించారు. అయితే కొందరు ముస్లింలు షమీకి అండగా నిలిచారు. చూడముచ్చటైన కుటుంబమని పేర్కొన్నారు.
ఈ క్రమంలో నెటిజన్లు చేసిన కామెంట్లపై టీమిండియా మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాణీ స్పందించాడు. ఇతరుల మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఏ ఒక్కరికి లేదనే విషయాన్ని గుర్తుంచుకోవలాని సూచించాడు. 'ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎవరికి లేదు. రెండోది ఇస్లాంలో బలవంతం లేదనే విషయం గుర్తుంచుకోవాలి' అని అన్నాడు.

మరోవైపు సీనియర్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా షమీకి మద్దుతు పలికాడు. 'ఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయి. మహ్మద్ షమీకి నా మద్దతు ఉంటుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను చెప్పదలచుకున్నది అర్థమయ్యి ఉంటుందని భావిస్తున్నా' అని కైఫ్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
ఎవరి ఇష్టం వచ్చిన దుస్తులు వారు ధరిస్తారు మీ పని మీరు చూసుకోండంటూ దుస్తులపై కామెంట్లు చేసిన వారిపై నెటిజన్లు షమీకి బాసటగా నిలిచారు. మరోవైపు సోషల్ మీడియాలో వెల్లువెత్తున కామెంట్లపై మహ్మద్ షమీ కూడా ట్విట్టర్‌లో అభిమానులకు సమాధానమిచ్చాడు. ఫొటోలోని వారిద్దరూ తన జీవితమని, ఎంతో సంతోషంతో ఉన్న తమను చూసి ఏడ్చేవారికి తానేమీ చెప్పలేనన్నారు. మంచేదో చెడేదో తనకు తెలుసని, మనిషి మంచితనం తెలియాలంటే అంతరంగం చూడాలని అన్నాడు.