హైదరాబాద్: సోమవారం సుప్రీం కోర్టు ఆదేశాలతో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన అనురాగ్ ఠాకూర్ స్పందించారు. మాజీ న్యాయమూర్తుల మార్గదర్శకత్వంలో బీసీసీఐ మెరుగ్గా ఉంటుందని సుప్రీం కోర్టు భావిస్తే సంతోషమని, పగ్గాలు చేపట్టబోయే వారికి అభినందనలంటూ అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
వివరాల్లోకి వెళితే జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను అమలు చేయకపోవడంతో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగిస్తూ సోమవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తీర్పు అనంతరం ఠాకూర్ మీడియాతో మాట్లాడారు.
సుప్రీం కోర్టు ఆదేశాలను తాను గౌరవిస్తున్నానని ఠాకూర్ అన్నారు. 'మాజీ న్యాయమూర్తుల మార్గదర్శకత్వంలో క్రికెట్ పరిపాలన మెరుగ్గా ఉంటుందంటే వారికి ఆల్ ది బెస్ట్' అంటూ కాస్తంత వెటకారంగా మాట్లాడారు. బీసీసీఐ స్వయం ప్రతిపత్తి కోసం తాము పాటుపడ్డాము కానీ వ్యక్తిగత పోరాటం కాదని వ్యాఖ్యానించారు. భారత క్రికెట్ బాగు కోసం, క్రీడల స్వయంప్రతిపత్తి కోసం తానెప్పుడూ కట్టుబడి ఉంటానని అన్నారు.

మాజీ న్యాయమూర్తుల నేతృత్వంలో బీసీసీఐ మెరుగవుతుందంటే వారికి 'ఆల్ ది బెస్ట్' అని చెప్పారు. వారి మార్గదర్శకత్వంలో భారత క్రికెట్ వర్ధిల్లుతుందని నమ్మకం ఉందని అన్నారు. కొన్నేళ్ల పాటు దేశ క్రికెట్‌కు సేవ చేసే గౌరవం నాకు లభించింది. ఆటలో అభివృద్ధి, పరిపాలన పరంగా బీసీసీఐ అత్యుత్తమ దశను చవిచూసిందని అన్నారు.
అత్యుత్తమ క్రీడా సంఘంగా బీసీసీఐ పేరుపొందిందని, బోర్డు సాయంతో రాష్ట్ర క్రీడా సంఘాలు మెరుగైన క్రికెట్ సదుపాయాలు కల్పించిందని చెప్పారు. ప్రపంచంతో పోలిస్తే దేశంలోనే అత్యంత నాణ్యమైన ఆటగాళ్లున్నారు. ఎప్పటికైనా బీసీసీఐయే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ క్రీడా సంఘమని చెప్పుకొచ్చారు.