
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశానికి డుమ్మా కొట్టాడు. టెస్టు సిరిస్ ప్రారంభానికి ముందు ఇరు జట్లకు చెందిన కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొనడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. అలాంటిది గురువారం నిర్వహించిన మీడియా సమావేశానికి కోహ్లీ హాజరుకాకుండా భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను పంపించాడు.
ఈ సందర్భంగా సంజయ్ బంగర్ మాట్లాడుతూ ఆటగాళ్లంతా సానుకూల దృక్పథంతో ఉన్నారని అన్నాడు. ఇక, కోహ్లీ హాజరుకాకపోవడంపై వివరణ కోరగా కోహ్లీ-రవిశాస్త్రి ఇప్పటికే దక్షిణాఫ్రికాలో మీడియాతో మాట్లాడారు. అయితే ఆతిథ్య జట్టు కెప్టెన్ హాజరయ్యేది లేని దానిపై మాకు ముందస్తు సమాచారం లేదని అన్నాడు.
ఇదిలా ఉంటే టీమిండియా ఆటగాళ్లు గురువారం ప్రాక్టీస్ సెషన్‌లోనూ పాల్గొనలేదు. గురువారం ఉదయమే టీమ్ మేనేజ్‌మెంట్ ఈ రోజు ఆటగాళ్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ అని చెప్పింది. దీంతో ఒక్క ఆటగాడు కూడా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాలేదు. భారత జట్టు సిబ్బందితో పాటు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రమే టెస్టు జరిగే పిచ్‌ను పరిశీలించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశానికి రవిశాస్త్రితో కలిసి కోహ్లీ హాజరుకావాల్సి ఉంది. సుమారు గంట తర్వాత అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ వచ్చాడు. అతన్ని చూసిన స్థానిక మీడియా షాక్‌కు గురైంది. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.