హైదరాబాద్: మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. శ్రీలంక పర్యటనలో ఉన్న కోహ్లీసేన 71వ స్వాతంత్ర్యది నోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ జాతీయ పతాకాన్ని ఎగరేశాడు. జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు బృందంలోని మొత్తం సభ్యులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఆగస్టు 20 నుంచి జరిగే ఐదు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఐదు వన్డేల సిరిస్ అనంతరం లంకతో ఏకైక టీ20ని ఆడనుంది.
'దేశ ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయుడనైనందుకు హృదయం ఉప్పొంగుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం నాకింకా ప్రత్యేకం. ఆ రోజు మా నాన్న పుట్టినరోజు కూడా. చిన్నప్పుడు స్వాతంత్ర దినోత్సవం నాడు స్నేహితులతో కలిసి దిల్లీ వీధుల్లో గాలిపటాలు ఎగరేసి ఆడుకున్న రోజులు ఇంకా గుర్తున్నాయి. ఆ రోజు అన్ని చోట్లా భారత జెండా ఎగురుతుంటే చాలా చాలా ఆనందంగా అనిపించేది' అని కోహ్లీ ట్విట్టర్‌లో వీడియో మెసేజ్ పోస్టు చేశాడు.