హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్‌ను ముగించుకుని టీమిండియా త్వరలో వెస్టిండిస్ నుంచి భారత్‌కు తిరిగి రానుంది. అయితే విండిస్ పర్యటనలో భాగంగా ఆదివారం జమైకాలోని కింగ్ స్టన్ వేదికగా జరిగిన ఏకైక టీ20లో కోహ్లీసేన 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
అయితే విండిస్ పర్యటనలో క్రికెటర్లు ఆ పర్యటనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఓ ఫొటోను తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఈ ఫోటోలో శిఖర్ ధావన్ కుమారుడు జోరావర్‌తో కలిసి దిగాడు. 'జోరావర్ ట్రెండ్ సెట్టర్. అతని కొత్త హెయిర్ స్టైల్ చాలా అద్భుతంగా ఉంది. ఆ స్టైల్‌ని నేను కాపీ కొడతాను.' అని పాండ్యా ఈ ఫోటోని పోస్టు చేసి క్యాప్షన్ పెట్టాడు. జమైకా పేరున్న టీషర్టు ధరించిన జోరావర్ పాండ్యాతో కలిసి నవ్వుతూ ఇందులో ఉండటాన్ని మనం చూడొచ్చు.
మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా జోరావర్ కొత్త హెయిర్‌స్టైల్ నచ్చిందని ధావన్ ఓ సెల్ఫీని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. విండీస్ పర్యటన ముగిసిన అనంతరం కోహ్లీసేన జులై 26 నుంచి శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. లంకతో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది.