హైదరాబాద్: భారత క్రికెటర్లకు శుభవార్త. ఇప్పటి వరకు స్వదేశంలో జరిగే సిరీస్‌ల్లో భాగంగా సాధారణ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించిన భారత క్రికెట్ జట్టు ఇకపై బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదం తెలిపింది.
స్వదేశంలో మ్యాచ్‌ల సందర్భంగా తాము విమానంలో ప్రయాణించే సమయంలో అసౌకర్యానికి గురవుతున్నామని భారత క్రికెటర్లు ఇటీవలే బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం వల్ల చాలా మంది తోటి ప్రయాణికులు తమతో సెల్ఫీలు దిగేందుకు ఇబ్బంది పెడుతున్నారని బీసీసీఐకి వెల్లడించారు.

అంతేకాదు కాళ్లు పెట్టుకోవడానికి కూడా స్పేస్ కూడా తక్కువగా ఉందని బీసీసీఐకి నివేదించిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో స్వదేశంలో కూడా బిజినెస్ క్లాస్ ప్రయాణాన్నే తమకు కల్పించాలని క్రికెటర్లు బీసీసీఐని కోరారు. దీనికి బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. నిజానికి ఇప్పటి వరకు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రమే టీమిండియాకు బిజినెస్ క్లాస్ టిక్కెట్లు బుక్ చేస్తున్నారు.
స్వదేశంలో ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణిస్తున్నారు. అయితే కెప్టెన్, కోచ్ మాత్రం స్వదేశంలోనూ బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వెసులుబాటుని కల్పించారు. తాజాగా క్రికెటర్ల కోరికను పరిగణనలోనికి తీసుకున్న బీసీసీఐ.. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ముందు ఉంచింది.
దీంతో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మీటింగ్‌లో ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసినట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షడు సీకే నేతృత్వంలోని క్రికెట్ పరిపాలన కమిటీ(సీఓఏ) స్పష్టం చేసింది. కాగా, న్యూజిలాండ్ వన్డే, టి20 సిరీస్‌లను నెగ్గి ఉత్సాహంతో ఉన్న టీమిండియా శ్రీలంకతో స్వదేశంలో మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ను ఆడనుంది.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఇప్పటికే భారత్ చేరుకున్న శ్రీలంక జట్టు కోల్‌కతాలో రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లు కూడా ఆడిన సంగతి తెలిసిందే. మరోవైపు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సోమవారం కోల్‌కతాకు చేరుకుంది.