హైదరాబాద్: ఐస్ బకెట్ చాలెంజ్ తెలుసు కదా.. ఒకప్పుడు ఈ ఛాలెంజ్ యావత్ ప్రపంచాన్ని ఎంతగానో ఆకర్షించింది. తాజాగా ఇలాంటిదే మానెక్విన్ చాలెంజ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు ఈ 'మానెక్విన్ ఛాలెంజ్'ను స్వీకరించింది.
ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్ విజయానంతరం భారత జట్టు డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది కలిసి ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా 81 సెకన్ల పాటు ఎక్కడి వాళ్లు అక్కడే కదలకుండా నిలబడిపోయారు. మానెక్విన్ అంటే బొమ్మ.

ఈ చాలెంజ్‌లో భాగంగా వీడియో తీయడం మొదలుపెట్టగానే అలా బొమ్మలా నిలబడిపోవాలి. తాజాగా టీమిండియా ఆటగాళ్లు ఈ చాలెంజ్‌లో పాల్గొన్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కోహ్లి సిరీస్ విజయానికి గుర్తుగా ఇచ్చిన ట్రోఫీని ముద్దాడుతూ నిలబడితే.. ఇషాంత్ శర్మ సోఫాపై సేదదీరుతున్నట్లుగా ఫోజిచ్చాడు.
ఇక మనీష్ పాండే చెన్నై టెస్టులో ట్రిపుల్ సెంచరీ వీరుడు కరుణ్ నాయర్‌ను అభినందిస్తున్నట్లు.. పుజారా బ్యాట్‌ను పరిశీలిస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. క్రికెటర్లతో పాటు సహాయ సిబ్బంది కూడా ఈ వీడియోలో రకరకాల ఫోజుల్లో కనిపించారు. ఈ వీడియోలో చివరగా ప్లేయర్లంతా కలిసి క్రిస్టమస్ శుభాకాంక్షలు చెప్పారు.
టీమిండియా కంటే ముందు ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్‌కి కామెంటరీ ఇచ్చిన టీమ్ ఈ చాలెంజ్ స్వీకరించింది. అందులో సంజయ్ మంజ్రేకర్, ఆకాశ్ చోప్రా, కపిల్ దేవ్, మైక్ ఆథర్టన్, ఇయాన్ బోథమ్ తదితరులు ఉన్నారు. టెస్టు సిరిస్ అనంతరం 20 రోజుల సమయం దొరకడంతో భారత ఆటగాళ్లంతా క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకల్లో బిజిగా ఉన్నారు.