హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టెస్టుల్లో టీమిండియా తమ నెంబర్ వన్ ర్యాంకును మరింత పటిష్టం చేసుకుంది. రెండో టెస్టు విజయంతో భారత్ నెంబర్ వన్ ర్యాంకుకు ఎలాంటి ఢోకా లేదు.
రెండో టెస్టు ముగిసిన వెంటనే ఐసీసీ తమ అధికారిక ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో నాలుగు టెస్టుల సిరిస్‌లో భాగంగా ఆసీస్‌తో జరగనున్న మిగతా రెండు టెస్టుల్లో భారత్ ఓటమి పాలైన ఆస్ట్రేలియా జట్టు నెంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకోలేదు. ఈ నేపథ్యంలో కోహ్లీసేన బంపర్ ఆఫర్ అందుకోనుంది.

ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా 121 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 109 పాయంట్లతో రెండో స్థానంలో ఉంది. టాప్ ర్యాంకర్‌లో ఉన్న టీమిండియాకు ఆసీస్ మధ్య 12 పాయింట్ల వ్యత్యాసం ఉంది. మిగతా రెండు టెస్టుల్లో ఫలితం ఎలా ఉన్నా కటాఫ్ తేదీ అయిన ఏప్రిల్ 1 నాటికి భారత ర్యాంకులో మార్పుండదు.
దీంతో ఏప్రిల్ 1 నాటికి టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న జట్టుకు ఐసీసీ ఒక మిలియన్ డాలర్లను నజరానాగా అందించనుంది. రెండో టెస్టు గెలిచిన సందర్భంగా ఐసీసీ ఓ ట్వీట్ చేసింది. 'కటాఫ్ తేదీ ఏప్రిల్ 1 వరకు కోహ్లీ సేన అగ్రస్థానంలో మార్పు ఉండదు. టాప్ ర్యాంక్‌లో నిలిచిన టీమిండియాకు రూ.6.6 కోట్ల నగదు బహుమతిని అందుకోనుంది' అని ఐసీసీ ట్వీట్ చేసింది.