భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కీర్తికిరీటంలో మరో అరుదైన మైలురాయి చేరింది. ముంబైలోని అజింక్య డీవై పాటిల్ యూనివర్సిటీ తమ 10 స్నాతకోత్సవ వేడుకల్లో భాగంగా రోహిత్ శర్మకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. క్రికెట్ రంగానికి ఆయన చేసిన అసమాన సేవలు, అద్భుతమైన నాయకత్వ పటిమను గుర్తిస్తూ విశ్వవిద్యాలయం ఈ గౌరవాన్ని అందించింది.
నాయకత్వానికి దక్కిన గౌరవం
యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఛాన్సలర్ డాక్టర్ అజింక్య డీవై పాటిల్ సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. "అభిమానులు ఆయనను క్రికెట్ 'హిట్‌మ్యాన్'గా పిలుచుకుంటారు, కానీ ఈ రోజు రోహిత్ శర్మ జీవితంలో ఒక భిన్నమైన మైలురాయి. పట్టుదల, వ్యూహరచన వంటి విలువలకు రోహిత్ నిదర్శనం. 2026 గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులకు ఆయన ప్రయాణం ఒక గొప్ప స్ఫూర్తి" అని పేర్కొంది.

రోహిత్ శర్మ అద్భుత ప్రస్థానం
38 ఏళ్ల రోహిత్ శర్మ ఇటీవలే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. వన్డే ఫార్మాట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించి, లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచారు.రోహిత్ నాయకత్వంలో టీమ్ ఇండియా 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలను కైవసం చేసుకుని ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యాన్ని చాటింది.
విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్.. భారత వైట్ బాల్ క్రికెట్ శైలిని పూర్తిగా మార్చేశారు. జట్టులో దూకుడును పెంచడంతో పాటు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్టేడియంలో ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవడం రోహిత్ శర్మ ప్రత్యేకత. రోహిత్ శర్మకు ఈ డాక్టరేట్ దక్కడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.