
95 మ్యాచులలో 97 వికెట్లు:
డేల్ స్టెయిన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ సీజన్ నుంచి 2020 వరకు ఆడాడు. ఈ 12 ఏళ్లలో నాలుగు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 95 మ్యాచులు ఆడాడు. డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ తరఫున అతడు బరిలోకి దిగాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడిన స్టెయిన్.. ఐపీఎల్ 2021 సీజన్‌కు దూరంగా ఉన్నాడు. స్టెయిన్ 95 మ్యాచులలో 97 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 3/8. భారత అభిమానులు ఇష్టపడే విదేశీ క్రికెటర్లలో స్టెయిన్ ఒకడు. అతడికి కూడా భారత్ అన్నా, ఇక్కడకి అభిమానులు అన్నా ఎంతో ఇష్టం.

అభిమానం వెలకట్టలేనిది:
ఆర్‌ఎమ్‌ఎస్ అడ్వైజరీ గ్లోబల్ వెబ్‌సైట్‌కు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డేల్ స్టెయిన్ మాట్లాడుతూ ఐపీఎల్, భారత అభిమానులపై స్పందించాడు. 'ఐపీఎల్ ఆడడం చాలా సంతోషంగా ఉంది. జీవితకాలం పాటు గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ప్రాక్టీస్‌ని వదిలేసి బస్సు ఎక్కడానికి ప్రయత్నించడం లేదా ఎయిర్‌పోర్టుకు వెళ్లడం చాలా సరదాగా ఉండేది. మైదానం, హోటల్లో సహచరులతో గడపడం.. అభిమానుల నుంచి తప్పించుకోవడం వంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. క్రికెట్ అంటే క్రికెటే.. వారాంతంలో ఒక మంచి ఆటగాడికి వ్యతిరేకంగా ఆడాల్సి ఉంటుంది. ఒక క్లబ్ గేమ్‌లో అదే జరుగుతుంటుంది. కానీ భారతదేశంలో అందుకు పూర్తి బిన్నం. ఫాన్స్ అభిమానం వెలకట్టలేనిది. భారత ఫాన్స్ క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు' అని స్టెయిన్ అన్నాడు.

రాక్ స్టార్‌గా:
భారతదేశంలో ఉన్నప్పుడు తాను ఓ రాక్ స్టార్‌గా భావించానని డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు. తాను ఐపీఎఎల్‌ను ఎప్పటికి ఇష్టపడుతానని, టోర్నీలో జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పాడు. 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున స్టెయిన్ ఐపీఎల్ టోర్నీలోకి అరంగేట్రం చేశాడు. ఆపై డెక్కన్ ఛార్జర్స్ మరియు గుజరాత్ లయన్స్ ఆడాడు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు. తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి తిరిగి వచ్చాడు. తన చివరి మ్యాచ్ 2020లో స్టెయిన్ ఆడాడు. స్టెయిన్ 95 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు పడగొట్టాడు. సగటు 25.86 కాగా.. స్ట్రైక్ రేట్ 22.43. 38 ఏళ్ల వయస్సులో కూడా 6.92 మంచి ఎకానమీ రేటు మెయింటైన్ చేశాడు. ఇక యూఏఈ వేదికగా ఈ నెల 19న ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. గత సీజన్ మాదిరిగానే దుబాయ్, షార్జా, అబుదాబిలో కఠిన బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్ మ్యాచులు జరగనున్నాయి.

సచిన్ ఇబ్బంది పెట్టాడు:
కెరీర్లో తనను ఇబ్బంది పెట్టిన బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ అని డేల్ స్టెయిన్ తెలిపాడు. 'ఓ ఫాస్ట్ బౌలర్‌గా రోజంతా వేగంగా బౌలింగ్ చేయాలనుకుంటా. కానీ కొన్ని సందర్భాల్లో బలమైన బ్యాట్స్‌మన్ బ్యాటింగ్‌కు దిగుతాడు. అప్పుడు వారిని ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో ఎక్కువగా ఆలోచించకూడడు. శక్తిని వృథా చేయకూడదు. నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాట్స్‌మన్‌పై దృష్టి పెట్టాలి. వారిని లక్ష్యం చేసుకుని ఆడాలి. అప్పుడు తమను తాము కాపాడుకోవడానికి వారు ప్రయత్నాలు చేస్తుంటారు. నా ఆటలో ఇదే సూత్రాన్ని పాటించా. బాగా ఆడే బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయడం కోసం ఎక్కువ కష్టపడటంలో అర్థం లేదు. అందుకే బలహీనంగా ఆడేవారిని లక్ష్యం చేసుకుని ఒకరి తర్వాత మరొకటి వికెట్లు తీస్తుంటా. అందుకే కెరీర్లో విజయవంతమైన బౌలర్‌గా కొనసాగా. సచిన్ విషయంలోనూ ఇదే చేశా. మరొక బ్యాట్స్‌మన్‌కు బ్యాటింగ్‌కు రప్పించేందుకు సచిన్‌కు సింగిల్ ఇచ్చేవాడిని' అని చెప్పాడు.

93 టెస్ట్‌లు, 125 వన్డేలు, 47 టీ20లు:
దక్షిణాఫ్రికా తరఫున 93 టెస్ట్‌లు, 125 వన్డేలు, 47 టీ20 ఆడిన డేల్ స్టెయిన్.. సుదీర్ఘ ఫార్మాట్‌లో 439 వికెట్లు.. వన్డేల్లో 196 వికెట్లు, 47 టీ20ల్లో 64 వికెట్లు తీశాడు. ఇక గాయాలతో తెగ ఇబ్బందిపడిన స్టెయిన్ రెండేళ్ల క్రితమే సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. 2005లో ఆసియా ఎలెవన్, సౌతాఫ్రికా ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టిన స్టెయిన్.. 2013లో పాకిస్థాన్‌పై (6/39) అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 2007లో న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడిన స్టెయిన్.. వెస్టిండీస్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లోనే(4/9) కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. 2019లో శ్రీలంకతో చివరి వన్డే ఆడిన ఈ సౌతాఫ్రికా పేస్ దిగ్గజం.. గతేడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో చివరి టీ20 ఆడాడు.


Click it and Unblock the Notifications












