హైదరాబాద్: క్రికెట్ అంటే ఆయనకు ఎంతో అభిమానం. ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్‌లు జరిగినా అక్కడికి వెళుతుంటాడు. దీంతో క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని స్టేడియాలు కట్టించడం ద్వారా చాటాలని అనుకున్నాడు. అతడే భారత సంతతికి చెందిన ఓ గుజరాత్ వ్యాపారి జిగేశ్ పాండ్యా. అమెరికాలో ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్.
ప్రస్తుతం అమెరికాలో స్థిరాస్థి వ్యాపారం చేస్తున్నాడు. తాను మ్యాచ్‌లను వీక్షించేందుకు వెళ్లినప్పుడు అమెరికాలో క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉండటంతో ఇది పెద్ద మార్కెట్ అవతరించనుందని, ఇక్కడ క్రీడల ద్వారా మిలియన్ డాలర్ల రెవెన్యూ వస్తుందని అభిప్రాయపడ్డారు. దీంతో అమెరికాలో క్రికెట్‌ను ప్రాముఖ్యతను పెంచేలా ఎనిమిది స్టేడియాలను నిర్మించనున్నట్లు ప్రకటించాడు.

దీని కోసం క్రికెట్‌కు అవసరమైన మౌలిక వసతులు కల్పనలో భాగంగా అమెరికా వ్యాప్తంగా ఎనిమిది క్రికెట్ స్టేడియాలు నిర్మించాలని ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపాడు. 2.4 యూఎస్ బిలియన్ డాలర్లు ఖర్చుతో న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, ఫ్లోరిడా, టెక్సాస్, ఇల్లినాయిస్, కాలిఫోర్నియా, జార్జియా ప్రాంతాల్లో క్రికెట్ మైదానాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఒక్కో స్టేడియం సామర్థ్యం 26 వేల మంది వరకు ఉంటుంది. కొత్త క్రికెట్ స్టేడియాలతో అమెరికాలో 17,800 కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని తెలిపాడు. ఈ ఎనిమిది స్టేడియాలను నిర్మించడం వల్ల 2024లో ఐసీసీ వరల్డ్ టీ20 కప్‌కు అమెరికా ఆతిథ్యం ఇవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు.