గజగజ వణికించిన హర్మన్‌ప్రీత్
ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన తర్వాత హర్మన్‌ప్రీత్ సేన 5వికెట్లు కోల్పోయి ఆల్-టైమ్ రెండో అత్యధిక స్కోరు 333పరుగులను స్కోరు బోర్డు మీద నమోదు చేసింది. 40ఓవర్ల వరకు ఒక లెక్క ఆ తర్వాత ఒక లెక్క అనేలా హర్మన్ ఎటాకింగ్ గేమ్‌కు ఇంగ్లాండ్ బౌలర్లు చిత్తుచిత్తయ్యారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ గజగజ వణికించింది. చివరి పది ఓవర్లలో భారత్ ఏకంగా 122పరుగులు పిండుకుంది.
హర్లీన్ డియోల్‌తో కలిసి 113పరుగుల పార్ట్‌నర్ షిప్
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత షఫాలీ వర్మ (8) తొందరగా ఔటవ్వడంతో భారత్‌కు ఆదిలోనే దెబ్బ పడింది. కానీ స్మృతి మంధాన నం.3 యస్తిక భాటియా ఇన్నింగ్స్ నిర్మించారు. భాటియా (26), మంధాన (40)లు కూడా ఇరువురు తక్కువ వ్యవధిలో ఔట్ కాగా.. ఇంగ్లాండ్ కాస్త పైచేయి సాధించినట్లు కన్పించింది. అయితే హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్ (58) 4వ వికెట్‌కు 113పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి మ్యాచ్ మలుపు తిప్పారు. ఈ క్రమంలో భారత్‌ను 200 పరుగుల మార్కును అధిగమించింది. హర్లీన్ డియోల్ తన తొలి వన్డే అర్ధసెంచరీని నమోదు చేసింది.
చివరి 11బంతుల్లో 43పరుగులు
లారెన్ బెల్ వేసిన 40వ ఓవర్‌లో హర్మన్‌ప్రీత్ దండయాత్ర మొదలెట్టింది. ఫోర్లు, సిక్సర్లతో దంచికొట్టింది. ఈ క్రమంలో హర్మన్ 47వ ఓవర్లో తన సెంచరీ పూర్తి చేసుకుని వన్డేలో 5వ సెంచరీని నమోదు చేసింది. ఇక తాను ఎదుర్కొన్న చివరి 11బంతుల్లో హర్మన్ 43పరుగులు చేసింది. చివరి వరకు హర్మన్ ఉండడం, చివర్లో పూజా (18), దీప్తి (15) సహకారం అందించడంతో భారత్ 333పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ను మన బౌలర్లు వణికించారు. మరోసారి ఆ జట్టులో డాని వ్యాట్ (65), ఆలిస్ క్యాప్సే (39) కాసేపు ప్రతిఘటించినా అది ఏమాత్రం సరిపోలేదు. స్వింగ్ క్వీన్ రేణుకా సింగ్ 4 వికెట్లతో చురకత్తుల్లాంటి బంతులతో చిచ్చరేపింది. హేమలత 2, దీప్తి 1, షఫాలి 1 వికెట్ తీశారు. దీంతో ఇంగ్లాండ్ 45 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. సెప్టెంబరు 24న లార్డ్స్‌లో ఇరు జట్లు మూడోది మరియు చివరిదైన వన్డేలో తలపడనున్నాయి. భారత్ ఆ మ్యాచ్‌లోను గెలిచి ఇంగ్లాండ్‌పై క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది.
ఇరు జట్లు :
ఎమ్మా లాంబ్, టామీ బ్యూమాంట్, సోఫియా డంక్లీ, ఆలిస్ క్యాప్సే, డేనియల్ వ్యాట్, అమీ జోన్స్ (కెప్టెన్ & వికెట్ కీపర్), ఫ్రెయా కెంప్, సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్, కేట్ క్రాస్, లారెన్ బెల్
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, రేణుకా సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్


Click it and Unblock the Notifications












