మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలనుకున్న భారత అమ్మాయిల జట్టుకు షాక్ తగిలింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 183 పరుగులకే కుప్పకూలింది. మూడు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ మంగళవారం జరగనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 259 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫీ డివైన్ (79; 86 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్), ఓపెనర్ సుజీ బేట్స్ (58; 70 బంతుల్లో, 8 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. మ్యాడీ గ్రీన్ (42; 41 బంతుల్లో, 5 ఫోర్లు), జార్జియా ప్లిమ్మర్ (41; 50 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. భారత బౌలర్లలో రాధ నాలుగు, దీప్తి శర్మ రెండు, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్ చెరో వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కింది. నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనింగ్ జోడీ సుజీ-గ్రీన్ తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. గ్రీన్‌ను దీప్తి శర్మ ఔట్ చేసిన తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. 139 పరుగులకే కివీస్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. కానీ ఈ స్థితిలో మ్యాడీ గ్రీన్‌తో కలిసి సారథి డివైన్ ఇన్నింగ్స్ చక్కదిద్దింది. అయిదో వికెట్‌కు గ్రీన్‌తో కలిసి 82 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అయితే ఆఖర్లో కివీస్ దూకుడుకు ప్రయత్నించి వికెట్లను కోల్పోయింది.
అనంతరం ఛేదనలో భారత్ 47.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. రాధ యాదవ్ (48; 64 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోరర్. ఓ దశలో భారత్ 108/8తో నిలిచింది. కానీ సైమా ఠాకూర్ (29; 54 బంతుల్లో, 3 ఫోర్లు)తో కలిసి రాధ గొప్పగా పోరాడింది. తొమ్మిదో వికెట్‌కు వీరిద్దరు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలగింది.

ఛేదన ఆరంభంలోనే స్మృతి మంధాన డకౌటైంది. షెఫాలీ వర్మ (11), యస్తికా భాటియా (12) కూడా విఫలమవ్వడంతో 5 ఓవర్లకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. హర్మన్‌ప్రీత్ (24) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. కాగా, న్యూజిలాండ్ బౌలర్లలో లీతాహు, సోఫీ డివైన్ చెరో మూడు, జెస్ కెర్, ఎడెన్ తలో రెండు వికెట్లు తీశారు.