
హైదరాబాద్: ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ముంబై వేదికగా సోమవారం ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో మూడు వన్డేల సిరిస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే మిథాలీ సేన కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళల జట్టు 41.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఓపెనర్ స్మృతి మందాన 74 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 63 పరుగులు చేసింది. మంధానకు వన్డేల్లో ఇది 15వ హాఫ్ సెంచరీ. కెప్టెన్ మిథాలీ 47 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. పూనత్ రౌత్ 32 పరుగులతో ఫరవాలేదనిపించింది.
మంధాన-పూనమ్ రౌత్‌ల జోడి రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. ఇక మూడో వికెట్‌కు మంధాన-మిధాలీ రాజ్ జోడి 66 పరుగుల్ని జోడించి టీమిండియా అలవోక విజయాన్ని సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మహిళల జట్టు 43.3 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లాండ్ జట్టులో నటలీ స్కీవర్(85) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. జులన్ గోస్వామి, శిఖా పాండేలు చెరో నాలుగు వికెట్లు తీశారు. ఉమెన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ విజయంతో భారత్‌కు రెండు చాంపియన్‌షిప్ పాయింట్లు లభించాయి.
అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ రెండోస్థానంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ముంబైలోని వాంఖడె స్టేడియంలో గురువారం జరుగనుంది.