వాంఖడే వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత మహిళల జట్టుపై ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించి ఆసీస్ ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే.
అయితే మంగళవారం జరుగుతున్న ఈ మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ (119; 125 బంతుల్లో) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ సెంచరీ సాధించింది. లిచ్‌ఫీల్డ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 63, 78 పరుగులు సాధించింది. కాగా, మరో ఓపెనర్ అలిస్సా హీలి (82; 85 బంతుల్లో) కూడా భారీ స్కోరు సాధించింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 189 పరుగులు జోడించారు.

అయితే తర్వాత భారత్ బౌలర్లు సత్తాచాటారు. స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బ కొట్టారు. కానీ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గార్డెనర్ (30), అనబెల్ (23), అలన (26*) దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. టీమిండియా బౌలర్లలో శ్రేయాంక పాటిల్ మూడు వికెట్లతో సత్తాచాటింది. అమంజోత్ కౌర్ రెండు వికెట్లు, పూజ, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు. అయితే ఈ క్రమంలో దీప్తి రికార్డు సృష్టించింది. టీమిండియా బౌలర్లలో వన్డే ఫార్మాట్‌లో 100 వికెట్లు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
కాగా, తొలి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటి వన్డేలో ఆరు వికెట్లతో ఆసీస్ గెలిచింది. ఉత్కంఠగా సాగిన రెండో మ్యాచ్‌లో భారత్ మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. ఈ వన్డే సిరీస్ ముగిసిన అనంతరం స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది.