హైదరాబాద్: ఆసియా కప్ మహిళల టీ20 టోర్నమెంట్‌లో భారత జట్టు సరికొత్త రికార్డును సృష్టించింది. శుక్రవారం నేపాల్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 99 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 120 పరుగులు చేసింది.
వెల్లాస్వామి వనితా (21), అనుజ్ పటేల్ (16), పార్వీన్ (13), శిఖా పాండే (39 నాటౌట్), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (14 నాటౌట్) పరుగులతో రాణించారు. అనంతరం 121 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టును భారత్ ఆదిలోనే దెబ్బతీసింది. ఆ తర్వాత వరుసగా పెవిలియన్‌కు చేరారు.

దీంతో నేపాల్ 21 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో సరిత మగర్ చేసిన ఆరు పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. నేపాల్ జట్టులో నలుగురు క్రీడాకారిణులు ఖాతా డకౌట్‌గా వెనుదిరిగారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు ఎక్సట్రా పరుగులిచ్చింది.
భారత బౌలర్లలో పూనమ్ పాండే మూడు వికెట్లు తీయగా, మేఘనా, అనుజా పటేల్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. శిఖా పాండే, జోషి, ఏక్తా బిస్త్‌లు తలో వికెట్ తీసుకున్నారు. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో ఫైనల్‌కు చేరిన భారత మహిళల జట్టుకు ఇది ఐదో విజయం. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది.