
దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. వరుసగా బుధవారం జరిగిన మ్యాచ్‌లోనూ భారత మహిళా క్రికెటర్లు సత్తా చాటారు. కింబర్లే వేదికగా రెండో వన్డేలోనూ ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించారు. దీంతో 178 పరుగుల భారీ తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది.
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన సెంచరీ(135) చేసింది. హర్మన్ ప్రీత్(55), వేదకృష్ణమూర్తి(51) అర్ధసెంచరీలతో రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
భారత్ నిర్దేశించిన 303 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు సఫారీ జట్టు బరిలోకి దిగింది. కట్టుదిట్టమైన ఫీల్డింగ్.. బౌలర్ల మాయాజాలంతో దక్షిణాఫ్రికా టీమ్ 30.5 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ తో గోస్వామీ 200వన్డే వికెట్లను తీసిన రికార్డు నమోదు చేసింది. దీంతో ప్రపంచంలోనే 200 వన్డే వికెట్లు తీసిన మొట్ట మొదటి మహిళా క్రికెటర్ గా రికార్డుల్లోకెక్కింది.
సఫారీ జట్టు ఓపెనర్ లిజెలే లీ(73) మినహా ఎవరు రాణించకపోవడంతో సౌతాఫ్రికా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ జట్టులో ఏడుగురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టింది. గైక్వాడ్, శర్మ రెండేసి వికెట్లు తీశారు. జులాన్ గోస్వామికి ఒక వికెట్ దక్కింది.
స్మృతి మందాన సెంచరీ
మంధాన దూకుడు పెంచింది. 117 బంతుల్లో 9 ఫోర్లతో 103 పరుగులు చేసి సెంచరీ నమోదు చేసింది. స్మృతికి హర్మన్‌ప్రీత్ కౌర్(38) మంచి సహకారం అందిస్తుంది. వీరిద్దరు భాగస్వామ్యంతో 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
రెండు వికెట్లు కోల్పోయిన భారత్
బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ సేన దూకుడుగా రాణిస్తోంది. ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టు 32 ఓవర్లు పూర్తయ్యే సరికి 153 పరుగులు చేసింది. క్రీజులో కౌర్ (18), మంధన (81) ఉన్నారు.
స్మృతి మంధాన హాఫ్ సెంచరీ:
ఓపెనర్‌గా దిగి నాటౌట్‌గా కొనసాగుతున్న స్మృతి మంధాన అర్ధశతకం పూర్తి చేసింది. 22వ ఓవర్లోని మూడో బంతికి రెండు పరుగులు తీయడంతో ఆమె హాఫ్ సెంచరీ పూర్తి అయింది. మంధాన 50 పరుగులను 64 బంతుల్లో ఆడింది. ఇందులో నాలుగు సిక్సర్లు కూడా ఉన్నాయి. మంధానకు వన్డే కెరీర్‌లో 8వ హాఫ్ సెంచరీ.
తొలి వికెట్ కోల్పోయిన భారత్:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు పూనమ్ రౌత్-స్మృతి మంధాన మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. 13వ ఓవర్లో రౌత్(20), 24వ ఓవర్లో మిథాలీ రాజ్(20) అవుట్ అయ్యారు. 24 ఓవర్లు పూర్తయ్యే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.
టీమిండియా బ్యాటింగ్:
భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య బుధవారం రెండో వన్డే మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
మిథాలీరాజ్ నేతృత్వంలోని భారత జట్టు తొలి మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయాన్ని కైవసం చేసుకుంది. అంతే ఉత్సాహంతో ఈ వన్డేలోనూ గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది.
సఫారీ జట్టులో ఆడుతున్న మహిళా క్రికెటర్ త్రిషా చెట్టికి ఇది వందో వన్డే. భారత మహిళల జట్టు ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత ఇదే తొలి సిరీస్‌గా ఆడుతుంది. ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగుతోంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.