IND W vs PAK W: ఐసీసీ మహిళా ప్రపంచ కప్ 2025లో భారత జట్టు దాయాది పాకిస్థాన్ ను మరోసారి చిత్తుగా ఓడించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా, కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఆరో మ్యాచ్‌లో 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టోర్నమెంట్‌లో భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం కాగా.. పాకిస్థాన్‌కు రెండో ఓటమి కావడం గమనార్హం. వన్డే ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై భారత్ తరచూ గెలుపొందుతూనే ఉంది. ఇప్పటివరకు జరిగిన 12 వన్డేల్లోనూ టీమిండియాదే పైచేయి కావడం విశేషం.
భారత బ్యాటింగ్‌లో ప్రతిభ
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్ (46) సంయమనంతో కూడిన ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు పోరాడగలిగే స్కోరు అందించింది. ఓపెనర్ ప్రతీకా రావల్ (31) డయానా బేగ్ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి మంచి ఆరంభాన్ని ఇచ్చినా, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (23) త్వరగా ఔట్ కావడంతో టాపార్డర్‌పై ఒత్తిడి పెరిగింది.

పాకిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి క్రీజులో కుదురుకోవడానికి భారత బ్యాటర్లకు అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా, ఫాస్ట్ బౌలర్ డయానా బేగ్ 69 పరుగులిచ్చి నాలుగు వికెట్లు, కెప్టెన్ ఫాతిమా సనా 38 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. హర్లీన్ డియోల్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (19)తో కలిసి 39 పరుగుల భాగస్వామ్యాన్ని, ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (32)తో కలిసి 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయినప్పటికీ, క్రమం తప్పకుండా వికెట్లు పడటంతో భారత్ ఇబ్బంది పడింది. దీప్తి శర్మ (25), స్నేహ రాణా (20) జోడీ 42 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. చివరి నాలుగు ఓవర్లలో రిచా ఘోష్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.
పాక్ పతనం: 159 పరుగులకే ఆలౌట్
248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు, భారత బౌలర్ల ముందు తలవంచింది. 43వ ఓవర్‌లోనే కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. పాకిస్తాన్ బ్యాటర్లలో సిద్రా అమీన్(81), నటాలియా పర్వేజ్(33) తప్ప మిగతా వారెవరూ రాణించలేదు. భారత బౌలర్లు క్రాంతి గౌడ్, దీప్తి శర్మ తలో మూడు వికెట్లు తీసి పాకిస్థాన్ పతనాన్ని శాసించారు.
సంక్షిప్తంగా:
*ఇండియా: 247/10
*పాకిస్థాన్: 159/10