IND vs SL: భారత మహిళా క్రికెట్ జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 5-0తో కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. తిరువనంతపురంలో జరిగిన ఉత్కంఠభరితమైన చివరి మ్యాచ్‌లో టీమిండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆరంభంలో షెఫాలీ వర్మ (5) విఫలమైనప్పటికీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. ఆమె కేవలం 43 బంతుల్లోనే 68 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచింది. హర్లీన్ డియోల్ (13), అమన్‌జోత్ కౌర్ (21), అరుంధతి రెడ్డి (23) పరుగులతో రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. శ్రీలంక బౌలర్లలో రష్మిక, చమరి ఆటపట్టు, కవిషా తలో రెండు వికెట్లు తీశారు.

పోరాడి ఓడిన శ్రీలంక
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.శ్రీలంక బ్యాటర్లలో హాసిని పెరీరా (65), ఇమేషా దులాని (50) అర్ధసెంచరీలతో ఒంటరి పోరాటం చేసినా, భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు వారి ప్రయత్నం ఫలించలేదు. రత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ లంకను ఒత్తిడిలోకి నెట్టారు.
ప్రపంచ రికార్డును మట్టికరిపించిన దీప్తి శర్మ
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరిగిన ఐదో టీ20లో ఆమె ఓ అద్భుతమైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ ప్రపంచ అగ్రస్థానానికి చేరుకుంది. మ్యాచ్‌కు ముందు వరకు దీప్తి శర్మ, ఆస్ట్రేలియా పేసర్ మెగన్ షూట్ ఇద్దరూ 151 వికెట్లతో సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నారు. అయితే తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో నీలాక్షి డి సిల్వా వికెట్ తీయడం ద్వారా దీప్తి 152వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా మెగన్ షూట్‌ను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే అత్యధిక టీ20 వికెట్లు తీసిన క్రీడాకారిణిగా అవతరించింది.
భారత్ తరపున తొలి క్రికెటర్‌గా రికార్డు
దీప్తి శర్మ సాధించిన ఈ ఘనత కేవలం మహిళా క్రికెట్‌కే పరిమితం కాలేదు. పురుషుల,మహిళల విభాగాల్లో కలిపి టీ20ల్లో 150 వికెట్లు తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. 132 మ్యాచ్‌ల్లోనే 152 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది. దీప్తి కేవలం బౌలింగ్‌లోనే కాదు, ఆల్ రౌండ్ ప్రదర్శనలోనూ తిరుగులేని రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000కి పైగా పరుగులు,150కి పైగా వికెట్లు తీసిన ప్రపంచంలోని మొట్టమొదటి క్రికెటర్‌గా (పురుషులు,మహిళలు కలిపి) దీప్తి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 1,100 పరుగులు, 152 వికెట్లు ఉన్నాయి.
టీమిండియా సృష్టించిన రికార్డులు ఇవే:
ఈ అద్భుత విజయంతో హర్మన్‌ప్రీత్ సేన పలు అరుదైన మైలురాళ్లను అందుకుంది. ఒక టీ20 సిరీస్‌ను భారత్ 5-0తో గెలవడం ఇది మూడోసారి కావడం విశేషం. గతంలో వెస్టిండీస్ (2019), బంగ్లాదేశ్ (2024) లపై ఈ ఘనత సాధించింది. శ్రీలంకపై టీ20ల్లో భారత్‌కు ఇది 25వ విజయం.