
హైదరాబాద్: హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టెస్టులో భువనేశ్వర్ కుమార్, బుమ్రా లేకున్నా టీమిండియాకు ఇబ్బందేమీ లేదని ఆ దేశ మాజీ ఆటగాడు డారెన్ గఫ్ అన్నారు. ప్రస్తుతం భారత్‌కు ప్రత్యర్థిపై దాడిచేయగల అత్యుత్తమ బౌలింగ్ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. కోహ్లీ ముందు పేస్, స్పిన్ విభాగంలో చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
'భువి లేకపోవడం నష్టమే. ప్రస్తుతం భారత్ ఒకప్పటిలా ఒకే బౌలర్‌పై ఆధారపడడం లేదు. గతంలో అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, జహీర్‌ఖాన్‌పై అతిగా ఆధారపడేది. ఇప్పుడు అన్ని వికెట్లపై బౌలింగ్ వేసే ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు భారత్‌ను ఓడించాలంటే అత్యుత్తమంగా ఆడాల్సిందే. భువి స్వింగ్ చేయగలడు. బుమ్రా మోసపూరిత బంతులతో బోల్తా కొట్టిస్తాడు. ఉమేశ్ కొత్తబంతితో చెలరేగుతాడు. వేగం పెంచాడు. షమి పిచ్‌పై బంతులను బలంగా వేయగలడు. ఇషాంత్‌కు అనుభవం, దూకుడు ఉన్నాయి. చాలా ఓవర్లు వేయగలడు' అని గఫ్ పేర్కొన్నారు.
ఇంగ్లీషు జట్టు భారత్‌ను ఓడించడంపై సూచనలిస్తూ.. 'ఇండియాని గెలుచుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు. స్వదేశంలో ఆడుతున్నామా.. బయట ఆడుతున్నామా అనేది పట్టించుకోకుండా అత్యుత్తమ ప్రదర్శన చేస్తేనే గానీ విజయం మీ సొంతం కాదు. ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ వాళ్ల అనుభవంతో ఏదైనా మాయాచేయగలరు.' అని పేర్కొన్నాడు.
స్పిన్నర్లలో కుల్‌దీప్ ఇప్పటికై ఇంగ్లాండ్‌పై తన సత్తా నిరూపించుకున్నాడని గఫ్ అన్నారు. ఉపఖండం పరిస్థితుల్లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఆడలేమన్నాడు. రవీంద్ర జడేజా త్వరగా వికెట్లు పడగొడతాడన్నారు. ఎక్కువ మంది బౌలర్లు ఉండటంతో విరాట్ కోహ్లీకి ఎంపికలో చిక్కులు తప్పవని పేర్కొన్నారు.