
మాంచెస్టర్: మరో రెండు రోజుల్లో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ టోర్నమెంట్ తొలి సెమీఫైనల్‌ను ఆడబోతోంది. మంగళవారం ఇంగ్లండ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కాబోయే ఈ మ్యాచ్‌లో టీమిండియా..న్యూజీలాండ్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ సందర్భంగా ఆ జట్టు బలాబలాలను అంచనా వేస్తోంది. బౌలింగ్ వనరులు, బ్యాటింగ్ విభాగంపై లెక్కలు తీస్తోంది. ఓపెనర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయగలిగితే- న్యూజిలాండ్‌పై సగం విజయాన్ని సాధించినట్టే అవుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నప్పటికీ.. ఆశించిన ఫామ్‌లో లేదని చెబుతోంది టీమ్ మేనేజ్‌మెంట్. దీనికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకుంటోంది.
కివీస్ వీక్‌నెస్‌పై గురి
న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ బలహీనతల గురించి తాము సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని టీమిండియా సహాయక కోచ్ సంజయ్ బంగర్ తెలిపారు. టీమిండియా నెట్ ప్రాక్టీస్‌లో మునిగిపోయిన సందర్భంగా ఆయన ఓల్ద్ ట్రాఫొర్డ్ స్టేడియంలో విలేకరులతో మాట్లాడారు. సెమీఫైనల్ కోసం సన్నద్ధమౌతున్నామని అన్నారు. న్యూజిలాండ్ బలహీనతలపై కన్నేశామని, దీనికి అనుగుణంగా తాము వ్యూహాలను రూపొందించుకుంటున్నామని సంజయ్ బంగర్ చెప్పారు. న్యూజిలాండ్ జట్టుతో సిరీస్ ఆడి, ఎక్కువ రోజులు కాలేదని, ఆ పర్యటన సందర్భంగా బ్లాక్ క్యాప్స్ బలహీనతలను కనిపెట్టామని అన్నారు.
ఓపెనర్లు, టాప్ ఆర్డర్‌ను కట్టడి చేయడం ద్వారా కివీస్ టీమ్‌పై ఒత్తిడి తీసుకుని రావచ్చని చెప్పారు. చివరి మూడు మ్యాచుల్లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయినప్పటికీ.. ఏ మాత్రం తక్కువగా అంచనా వేయట్లేదని అన్నారు. ఓపెనర్ రోహిత్ శర్మకు ఎప్పుడు? ఎలా? ఆడాలో బాగా తెలుసని సంజయ్ బంగర్ అన్నారు. ఈ విషయంలో అతణ్ని మించిన వారు లేరని చెప్పారు. పిచ్, పరిస్థితులు, వాతావరణం ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తాడని అన్నారు. పిచ్ ఎలా ఉన్నా, సహకరించకపోయినా.. బ్యాటింగ్ ఎలా చేయాలో రోహిత్ శర్మకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదని చెప్పారు.