
క్లాసిక్ షాట్లతో చిచ్చు రాజేసిన గిల్
విండీస్ మీద సెంచరీ త్రుటిలో చేజార్చుకున్న శుభ్ మన్ గిల్ ఈ మ్యాచ్‌లో సెంచరీ ముచ్చట తీర్చుకున్నాడు. వన్డౌన్లో బరిలోకి దిగిన గిల్ విరాట్ కోహ్లీని తలపించాడు. 97బంతుల్లో 15ఫోర్లు, 1సిక్సర్‌తో 135పరుగులు చేసి శభాష్ అనిపించాడు. గ్రౌండ్ నలువైపులా చూడచక్కని క్లాసిక్ షాట్లతో అలరించాడు. హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో ఇండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా బ్యాటర్లు నిదానంగా ఆడుతున్నా.. అతను మాత్రం మంచి స్ట్రైక్ రేటుతో పరుగులు రాబట్టాడు.

పూర్తి డిఫెన్స్ ఆడిన ఓపెనర్లు..!
ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు కొట్టి ధావన్ టచ్‌లోకి వచ్చాడు. అయితే మరో ఎండ్‌లో రాహుల్ పూర్తి డిఫెన్స్ ఆడాడు. ఇక 7వ ఓవర్లో ధావన్‌కు క్యాచ్ లైఫ్ దక్కింది. 11వ ఓవర్లో ఫోర్ కొట్టి రాహుల్ తన మార్క్ చూపించడానికి రెడీ అయ్యాడు. అయితే అతను ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. 15వ ఓవర్లో బ్రాడ్ ఈవన్స్ బౌలింగ్లో సిక్స్ కొట్టి ఆ ఓవర్ చివరి బంతికి రాహుల్ (30పరుగులు 40బంతుల్లో) బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కాసేపటికే ధావన్ (40పరుగులు 68బంతుల్లో 5 ఫోర్లు) క్యాచ్ ఔటయిపోయాడు.

140 పరుగుల స్టాండ్ ఇచ్చిన గిల్, ఇషాన్
ఇక వన్డౌన్లో వచ్చిన గిల్, రెండో డౌన్లో దిగిన ఇషాన్ కిషన్ స్కోరు బోర్డును నడిపించారు. ఇషాన్ కిషన్ తొలుత అతి జాగ్రత్తగా ఆడాడు. కాసేపయ్యాక వీరిద్దరు బ్యాట్ ఝళిపించారు. దీంతో స్కోరు కాస్త మూమెంటమ్ అందుకుంది. వీరిద్దరు అడపాదడపా ఫోర్లు బాదారు. ఈ క్రమంలో వీరిద్దరు తమ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇక హాఫ్ సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. ఎల్బీడబ్ల్యూ అప్పీల్ విషయంలో క్విక్ సింగిల్ తీయాలని ప్రయత్నించి నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఇషాన్ (50పరుగులు 61బంతుల్లో 4ఫోర్లు) ఔటయిపోయాడు. వీరిద్దరు 140పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

మార్క్ ఫినిషింగ్ ఇవ్వలేకపోయిన హుడా, శాంసన్
ఇక ఆ తర్వాత 82బంతుల్లో శుభ్ మన్ గిల్ తన తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డగౌట్లో ఉన్న సహచర ప్లేయర్లు చప్పట్లు కొడుతూ అతన్ని అభినందించారు. సెంచరీ తర్వాత గిల్ మరింత రెచ్చిపోయాడు. ఫోర్ల పరంపరకు తెరదీశాడు. దీపక్ హుడా (1), సంజూ శాంసన్ (15పరుగులు 2సిక్సర్లు) తమ మార్క్ ఫినిషింగ్ ఇవ్వలేకపోయారు. అప్పటికే ఓవర్లు దగ్గరపడ్డాయి. ఇక చివరి ఓవర్లో శుభ్ మన్ గిల్ కూడా ఔటయ్యాడు. దీంతో స్కోరు 289కి పరిమితమైంది.

తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్
జింబాబ్వే (ప్లేయింగ్ XI) : తకుద్జ్వానాషే కైటానో, ఇన్నోసెంట్ కైయా, టోనీ మున్యోంగా, రెగిస్ చకబ్వా (వికెట్ కీపర్, కెప్టెన్), సికందర్ రజా, సీన్ విలియమ్స్, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యాయుచి, రిచర్డ్ నగరవ


Click it and Unblock the Notifications












