సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన నాలుగో టీ20లో జింబాబ్వే భారత్ ముందు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆతిథ్య జట్టు జింబాబ్వే ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికిందర్ రజా (46; 28 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తాచాటాడు. ఓపెనర్లు మరుమని (32; 31 బంతుల్లో, 3 ఫోర్లు), వెస్లీ మధెవెరె (25; 24 బంతుల్లో, 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. టీమిండియా బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు, అభిషేక్ శర్మ, శివమ్ దూబె, సుందర్, తుషార్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు మరమని, వెస్లీ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ఆరంభించారు. అరంగేట్ర బౌలర్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్ బౌండరీలు సాధించి నాలుగు ఓవర్లకు జట్టు స్కోరును 35/0 చేర్చారు. ఈ స్థితిలో బంతి అందుకున్న రవి బిష్ణోయ్ స్కోరు వేగాన్ని తగ్గించడంతో జింబాబ్వే పవర్‌ప్లేలో 44/0తో నిలిచింది.

43 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వెస్లీ, మరమని క్రమంగా గేర్ మార్చడం ప్రారంభించారు. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన అభిషేక్ శర్మ మరుమని ఔట్ చేసి జింబాబ్వేను తొలి దెబ్బ కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అభిషేక్‌కు ఇదే తొలి వికెట్. తర్వాత ఓవర్‌లోనే మరో ఓపెనర్ వెస్లీని శివమ్ దూబె ఔట్ చేయడంతో జింబాబ్వే 10 ఓవర్లకు 67/2తో నిలిచింది.
ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ క్రమంగా వికెట్లు తీశారు. దీంతో జింబాబ్వే 15 ఓవర్లకు 98/4 స్కోరు సాధించింది. కానీ మరో ఎండ్‌లో ఉన్న సికిందర్ రజా పోరాటం కొనసాగించాడు. బౌండరీలతో హోరెతిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. 16వ ఓవర్ వేసిన సుందర్ బౌలింగ్‌లో సిక్సర్‌తో 13 పరుగులు రాబట్టుకున్నాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఆ తర్వాత ఓవర్‌లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు సాధించాడు.
అయితే దూకుడగా ఆడుతున్న సికిందర్ రజాను తుషార్ 19వ ఓవర్‌లో బోల్తా కొట్టించడంతో జింబాబ్వే జోరుకు బ్రేక్‌లు పడ్డాయి.