టీ20 వరల్డ్ కప్ విజయానంతరం భారత అభిమానులకు ఓ వైపు అమితానందం, మరోవైపు బాధ. 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ గెలిచామనే సంతోషించేలోపే, భారత క్రికెట్‌కు మూలస్తంభాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం అభిమానులను కలచివేసింది. ఈ ఇద్దరూ దశాబ్దం కాలంపాటు టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించారు.
అలాంటి ఈ స్టార్లు ఒకేసారి టీ20లకు గుడ్‌బై పలకడం భారత క్రికెట్‌కు మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తమ వారసులు ఎవరో నిర్ణయించుకుండానే తప్పుకోవడం టీమిండియాపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. అయితే రోహిత్ శర్మ వారసుడు దొరికేశాడు. హిట్‌మ్యాన్ స్థానాన్ని భర్తీ చేస్తూ భారత భవిష్యత్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తా అనే రీతిలో భరోసా ఇస్తున్నాడు. అతనే సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ.

23 ఏళ్ల అభిషేక్ ఎడమచేతి వాటం బ్యాటర్. రోహిత్‌లానే విధ్వంసం సృష్టించడం, పిచ్, ప్రత్యర్థితో సంబంధం లేకుండా ఊచకోత కోయడంలో నేర్పరి. అంతేగాక అభిషేక్ ఆల్‌రౌండర్. స్పిన్ కూడా వేయగలడు. గత ఐపీఎల్ సీజన్‌లో సంచలన ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అడ్రస్ నిలిచాడు. అందుకే సెలక్టర్లు ఆలస్యం చేయకుండా భారత జట్టులోకి తీసుకువచ్చారు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేశారు. అయితే యువరాజ్ సింగ్ శిష్యుడు అయిన అభిషేక్ తొలి టీ20లో డకౌట్ అయ్యాడు.
కానీ రెండో టీ20లో మాత్రం రికార్డులన్నీ బ్రేక్ చేశాడు. 46 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తొలి మ్యాచ్‌లో డకౌటయ్యాననే కసితో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 33 బంతుల్లో అర్ధశతకం అందుకున్న అతడు దాన్ని సెంచరీగా మలచడానికి మరో 13 బంతులే తీసుకున్నాడు. కుదురుకున్నాక రోహిత్ విధ్వంసాన్ని సృష్టించే స్టైల్‌లోనే అభిషేక్ చేస్తున్నాడు. రోహిత్ క్రీజులో ఉంటే ప్రత్యర్థికి ఎంతటి నష్టం వాటలిస్తాడో ఈ కుర్రాడు కూడా అదే పని చేస్తున్నాడు. దీంతో రోహిత్ వారసుడు అభిషేక్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కాటేరమ్మ పెద్ద కొడుకు రిటైర్మెంట్ ఇచ్చాడని, ఇప్పుడు చిన్నకొడుకు వచ్చాడని పోస్టులు వైరల్ అవుతున్నాయి.