
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యార్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌కు ముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును 14ఓవర్లకే వంద దాటించారు.
నికోలస్ పూరన్ అద్భుతమైన ఫీల్డింగ్ ద్వారా శుభ్ మన్ గిల్ (64పరుగులు) రనౌట్ కావడంతో 119పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ తొలుత నిదానంగా ఆడాడు. మరోపక్క గబ్బర్ తన మార్క్ షాట్లతో అలరిస్తుండగా.. శ్రేయస్ ఆచితూచి ఆడుతూ వికెట్ కాపాడాడు.
కాస్త కుదురుకున్నాక శ్రేయస్ తన గేర్ మార్చాడు. జైడెన్ సీల్స్ బౌలింగ్లో ఫోర్ కొట్టి టచ్‌లోకి వచ్చాడు. నికోలస్ పూరన్ బౌలింగ్లో రెండు మాసివ్ సిక్సులు, ఒక ఫోర్ బాది తనలోని హిట్టింగ్ కోణాన్ని చూపించాడు. ఇక ధావన్‌తో కలిసి 94పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ధావన్ (97పరుగులు) ఔటయ్యాక.. శ్రేయస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. 57బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు కొట్టి 54పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇకపోతే వన్డేల్లో శ్రేయస్ అయ్యార్ తాజా ఇన్నింగ్స్ ద్వారా అత్యంత వేగంగా 1000పరుగులు చేసిన మూడో భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో తన 25వ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ ఈ మైలురాయి చేరుకున్నాడు. తద్వారా 25ఇన్నింగ్స్‌లలో 1000పరుగులు చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో కలిసి ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ 24ఇన్నింగ్స్‌లలో 1000పరుగుల మైలురాయిని అందుకున్నారు.