ఎస్‌జీకి బదులుగా డ్యూక్స్ బంతులు ఉపయోగిస్తే మంచిది: విరాట్ కోహ్లీ


హైదరాబాద్: టెస్టు క్రికెట్‌లో వాడుతున్న ఎస్‌జీ బంతులు ఐదు ఓవర్లకే పాడవుతున్నాయని, ఆ ప్రభావం మ్యాచ్‌పై పడుతోందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
ఈ టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ టెస్టు క్రికెట్‌కు ఎస్‌జీకి బదులుగా డ్యూక్స్ బంతులు ఉపయోగిస్తే మంచిదని కోహ్లీ సూచించాడు. "ఒకప్పుడు ఎస్‌జీ బంతులు చాలా బాగుండేవి.. ఎందుకో తెలీదు కానీ ఈ మధ్య కాలంలో ఉత్పత్తి అయినవి చాలా నాసిరకంగా ఉంటున్నాయి" అని కోహ్లీ చెప్పాడు.

టెస్టు క్రికెట్ ఆడేందుకు డ్యూక్ బంతి బాగుంటుంది
"టెస్టు క్రికెట్ ఆడేందుకు డ్యూక్ బంతి బాగుంటుంది. ప్రపంచమంతా ఒకే బంతి వినియోగించాలంటే నేను డ్యూక్ బంతికే ఓటేస్తా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్పిన్నర్లు, పేసర్లు దాంతో కచ్చితత్వంతో బంతులు వేయగలరు. వేగమూ బాగుంటుంది. అశ్విన్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తా" అని కోహ్లీ అన్నాడు.

ఐదు ఓవర్లకే బంతి పాలిపోతోంది
"బంతి ఐదు ఓవర్లకే పాలిపోవడం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. ఒకప్పుడు ఎస్‌జీ బంతి నాణ్యత ఇప్పటికన్నా ఎంతో బాగుండేది. ఇప్పుడెందుకు తగ్గిందో అర్థం కావడం లేదు. డ్యూక్, కూకాబుర్ర బంతుల నాణ్యత బాగుంది. ముడిసరకు దొరకకున్నా, ఇబ్బందులు పడుతున్నా కూకాబుర్ర బంతి నాణ్యతను తగ్గించడం లేదు" అని కోహ్లీ పేర్కొన్నాడు.

బంతి గట్టిగా ఉంటే అదనపు వేగం లభిస్తుంది
"బంతి గట్టిగా ఉంటేనే సీమర్లకు ప్రయోజనం కలుగుతుంది. అదనపు వేగం లభిస్తుంది. 10, 12 ఓవర్లకే బంతి మెత్తబడితే బౌలర్ల శ్రమ ఫలితం 20 శాతం తగ్గుతుంది. మ్యాచ్ చప్పగా సాగుతుంది. బ్యాట్స్‌మెన్‌కు పరుగులు సులభంగా వస్తాయి" అని కోహ్లీ ఈ సందర్భంగా వెల్లడించాడు. డ్యూక్ బంతులు ఇంగ్లాండ్‌లో తయారవుతుండగా, ఎస్‌జీ బంతులు మాత్రం భారత్‌లోనే తయారవుతుండటం విశేషం.

ఎస్‌జీ బంతిపై అశ్విన్ అసహనం
కాగా, వెస్టిండీస్‌తో తొలి టెస్టు ముగియగానే ఎస్‌జీ బంతిపై అశ్విన్ అసహనం వ్యక్తం చేశాడు. ఎస్‌జీ బంతిపై గ్రిప్ దొరకడం లేదని... వాటిలో నాణ్యత లేదని కూకాబుర్ర, డ్యూక్ బంతులు బాగున్నాయని అశ్విన్ తెలిపాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ దేశంలో ఏ బంతి వినియోగించాలన్న నిబంధన లేదు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక కూకాబుర్ర బంతులను వినియోగిస్తుండగా.... ఇంగ్లాండ్ డ్యూక్, భారత్ ఎస్‌జీ బంతులను వాడతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications