విశాఖపట్నంలో రెండో వన్డే: ఒకే రికార్డు వేటలో కోహ్లీ, ధోని


హైదరాబాద్: ఛేజ్ మాస్టర్... రన్ మెషిన్ ఇలా ఎన్ని పేర్లతో అభిమానులు ముద్దుగా పిలుచుకున్నా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తక్కువే. క్రీజులో అడుగుపెట్టాడంటే పరుగుల వరద పారించాల్సిందే. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి క్రేజ్ సంపాదించిన క్రికెటర్లలో మనకు గుర్తుకు వచ్చేది మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరుతెచ్చుకున్న ధోని కెప్టెన్‌గా భారత్‌కు అద్భుతమైన విజయాలను అందించాడు. అంతేకాదు ఐసీసీ నిర్వహించే మూడు ట్రోఫీలను భారత్‌కు అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. ఇక, కోహ్లీ విషయానికి వస్తే కెప్టెన్‌గా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. సచిన్ సాధించిన ప్రతి రికార్డునూ కోహ్లీ బద్దలు కొట్టే పనిలో ఉన్నాడు.

ఒకే రికార్డు వేటలో కోహ్లీ, ధోని
అయితే ఈ ఇద్దరూ ప్రస్తుతం ఒకే రికార్డు వేటలో ఉన్నారు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా బుధవారం భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య రెండో వన్డే విశాఖ వేదికగా జరగనుంది. ఈ వన్డేలో ఈ ఇద్దరూ రికార్డు అందుకుంటే చూడాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. తొలి వన్డేలో 140 పరుగులు చేసిన కోహ్లీ, ప్రస్తుతం వన్డేల్లో పది వేల పరుగులు మైలురాయిని అందుకోవడానికి కేవలం 81 పరుగుల దూరంలో ఉన్నాడు.

పది వేల పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా
కోహ్లీ ఈ మైలురాయిని గనుక అందుకుంటే వన్డేల్లో పది వేల పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా మొత్తంగా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం కోహ్లీ 212 వన్డేల్లో 58.69 యావరేజితో 9,919 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ 259 ఇన్నింగ్స్‌లు తీసుకోగా గంగూలీ 263, రికీ పాంటింగ్ 266 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు.

కోహ్లీ ఇప్పటి వరకు ఆడింది 204 ఇన్నింగ్స్‌లే
అయితే కోహ్లీ మాత్రం ఇప్పటి వరకు ఆడింది 204 ఇన్నింగ్స్‌లే. దీనిని బట్టి చూస్తే సచిన్ కన్నా అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయి కోహ్లీ అందుకోనున్నాడు. దీంతో పాటు వెస్టిండిస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచేందుకు గాను కోహ్లీ 47 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇదే గనుక జరిగితే సచిన్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు.

ధోని కూడా 51 పరుగుల దూరంలో
ఇదిలా ఉంటే, ధోని ఇప్పటికే వన్డేల్లో పది వేల మార్క్‌ను అందుకున్నా.. అందులో 174 పరుగులు ఆసియా ఎలెవన్ తరఫున సాధించినవి ఉన్నాయి. కేవలం భారత జట్టు తరుఫున పది వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి ధోని ఇంకా 51 పరుగుల దూరంలో ఉన్నాడు. ధోనికి ఎంతగానో అచ్చొచ్చిన విశాఖలో ఈ మైలురాయిని అందుకుంటాడేమో చూడాలి మరి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications