ముంబై: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా మరికొద్ది గంటల్లో జరుగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం దేశంలోని క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియానే గెలిచి ప్రపంచకప్‌కు మరింత దగ్గరవ్వాలని ఆశిస్తోంది.
మరోవైపు విండీస్ కూడా ఫైనల్ చేరాలని కృత నిశ్చయంతో ఉంది. అయితే ఈ సెమీస్‌లో విండీస్‌తో పోల్చుకుంటే భారత్‌కే సానుకూలాంశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభమై మూడు నెలలు గడిచాయో లేదో.. ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడేసింది భారత్.
అంతేగాక, ఆ15 టీ20 మ్యాచుల్లో 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఈ ఏడాది టీ20 మ్యాచ్‌ల్లో భారత్ ప్రదర్శన అద్భుతంగా ఉందని చెప్పడం అతియోశక్తి కాదేమో. ఇక విండీస్ ఈ ఏడాది కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. అదే భారత్‌కు పెద్ద సానుకూలాంశం.

కాగా, తాజా టోర్నీలో పసికూన ఆఫ్గనిస్థాన్ చేతిలో ఓడి ఆత్మవిశ్వాసం కోల్పోయింది విండీస్. అయితే, క్రిస్ గేల్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మన్, వికెట్లు పడగొట్టగల బౌలర్లు ఉండటం ఆ జట్టుకు సానుకూలాంశంగా చెప్పవచ్చు.
అయితే, ఈ ఏడాది ఫామ్, తరుచుగా టీ20లు ఆడడం, సొంతగెడ్డ మీద ఆడుతుండడంతో ఈ మ్యాచ్‌లోనూ గణాంకాలు భారత్‌వైపే ఉన్నాయనడంలో సందేహం లేదు.
ఇక ఈ ఏడాది టీ20ల్లో అత్యద్భుతంగా రాణిస్తున్న కోహ్లీ మరోసారి విజృంభిస్తే భారత్‌కు తిరుగుండదనే చెప్పవచ్చు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మంచి ఆరంభాన్నిస్తే టీమిండియా విజయానికి ఢోకా ఉండదనే చెప్పాలి.