అరంగేట్ర టెస్టులో సెంచరీ: 15వ ఆటగాడిగా పృథ్వీషా, ఆ 14 మంది ఎవరు?

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ పృథ్వీషా చరిత్ర సృష్టించాడు. తన అరంగేట్ర టెస్టులో 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో పృథ్వీషా సెంచరీ సాధించాడు. తద్వారా అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.
అరంగేట్ర టెస్టులో సెంచరీతో భారత్ తరుపున ఈ ఘనత సాధించిన 15వ ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీషా 154 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 134 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దేవేంద్ర బిషు బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో పృథ్వీషా అనేక రికార్డులు నెలకొల్పాడు.
భారత్ తరుపున అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా పృథ్వీషా నిలిచాడు. ఈ జాబితాలో ఓపెనర్ శిఖర్ ధావన్(187) పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఓపెనర్ శిఖర్ ధావన్(187) పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(177), గుండప్ప విశ్వనాధ్(137) ఉన్నారు.
ఇక, భారత్ తరుపున అరంగేట్ర టెస్టుల్లో సెంచరీలు సాధించిన ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి పరిశీలిద్దాం....

లాల్ అమర్నాథ్ - 118
లాల్ అమర్నాథ్ టీమిండియా మాజీ కెప్టెన్. 1933లో ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. అరంగేట్ర టెస్టులో ఓ భారత బ్యాట్స్‌మెన్ సెంచరీ చేయడం ఇదే మొదటిసారి.

దీపక్ శోధన్ - 110
గుజరాత్‌కు చెందిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 1952లో కోల్‌కతా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో ఈ మైలురాయిని అందుకున్నాడు. భారత్ తరుపున కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడిన దీపక్ శోధన్ 60.33 యావరేజితో 181 పరుగులు చేశాడు.

ఏజీ క్రిపాల్ సింగ్ - 100
స్ట్రోక్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన ఏజీ క్రిపాల్ సింగ్ రంజీల్లో మద్రాసు, హైదరాబాద్ జట్ల తరుపున ప్రాతినిథ్యం వహించాడు. తన సొంత మైదానమైన హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌పై ఈ ఘనత సాధించాడు. భారత్ తరుపున ఏజీ క్రిపాల్ సింగ్ కేవలం 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

అబ్బాస్ అలీ బెయిగ్ - 112
హైదరాబాద్‌కు చెందిన అబ్బాస్ అలీ బెయిగ్ 1959లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత పదేళ్లలో కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే, రంజీల్లో మాత్రం తనదైన ముద్ర వేశాడు. రంజీ క్రికెట్‌లో 200కుపైగా గేమ్స్ ఆడాడు.

హనుమంత్ సింగ్ - 105
రాజస్థాన్‌లో రాజవంశంలో జన్మించిన హనుమంత్ సింగ్ 1964లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాతి రోజుల్లో భారత్ తరుపున హనుమంత్ సింగ్ కేవలం 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత కొన్నాళ్లు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా వ్యవహారించాడు.

గుండప్ప విశ్వానాధ్ - 137
తన కెరీర్‌లో ఆడిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన గుండప్ప విశ్వనాధ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. 1969లో కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గుండప్ప విశ్వనాధ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. భారత్ తరుపున 91 టెస్టులాడిన గుండప్ప విశ్వనాధ్ 6080 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు ఉన్నాయి.

సురీందర్ అమర్నాథ్ - 124
లాల్ అమర్నాథ్ కుమారుడైన సురీందర్ అమర్నాథ్ 1976లో ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అయితే, ఆ తర్వాతి రోజుల్లో భారత జట్టులో తన సుస్థిరం చేసుకోలేకపోయాడు. భారత్ తరుపున కేవలం 10 టెస్టులు మాత్రమే ఆడాడు.

మహమ్మద్ అజహుద్దీన్ - 110
1984లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ అజహుద్దీన్ తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్ మన్‌గా అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. భారత్ తరుపున 99 టెస్టు మ్యాచ్‌లాడాడు. అంతేకాదు తన తొలి, ఆఖరి టెస్టులో సెంచరీ సాధించిన అతికొద్ది మంది అరుదైన ఆటగాళ్లలో అజహుద్దీన్ ఒకడు.

ప్రవీన్ ఆమ్రే - 103
ముంబైకి చెందిన ప్రవీన్ ఆమ్రే టెక్నిక్‌కు పెట్టింది పేరు. 1992లో దక్షిణాఫ్రికాతో డర్బన్ వేదికగా జరిగిన తన తొలి టెస్టులో సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత భారత్ తరుపున కేవలం 11 టెస్టులు మాత్రమే ఆడాడు.

సౌరవ్ గంగూలీ - 131
'గాడ్ ఆఫ్ ఆఫ్ సైడ్'గా పేరొందిన సౌరవ్ గంగూలీ 1996లో క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు. ఆ తర్వాత తన అద్భుతమైన ఆటతీరుతో అభిమానులను అలరించాడు. భారత్ తరుపున మొత్తం వందకుపైగా టెస్టులకు ప్రాతినిథ్యం వహించాడు.

వీరేంద్ర సెహ్వాగ్ - 105
ఢిల్లీకి చెందిన ఈ డాషింగ్ ఓపెనర్ అత్యంత వేగంగా టెస్టుల్లో సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. 2001లో దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత తన కెరీర్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించాడు.

సురేశ్ రైనా - 120
2010లో కొలంబో వేదికగా జరిగిన శ్రీలంకతో జరిగిన టెస్టులో సురేశ్ రైనా తన తొలి టెస్టులో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత భారత్ తరుపున ఆడిన 18 మ్యాచ్‌ల్లో రైనా తన సక్సెస్‌ని కొనసాగించలేకపోయాడు.

శిఖర్ ధావన్ - 187
2013లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ 187 పరుగులతో చెలరేగాడు. దీంతో అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు.

రోహిత్ శర్మ - 127
సుదీర్ఘ ఫార్మాట్‌లో స్థానం కోసం ఎదురుచూస్తోన్న ఈ ఓపెనర్ 2013లో కోల్‌కతా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన టెస్టులో సెంచరీతో రాణించాడు. ఇది సచిన్ టెండూల్కర్ ఫేర్ వేల్ సిరిస్ కావడం విశేషం. ఆ తర్వాత టెస్టుల్లో విఫలం కావడంతో రోహిత్ శర్మ టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications