
హైదరాబాద్: లక్నో వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతోన్న రెండో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ విజృంభించాడు. తనదైన శైలిలో దూకుడుగా ఆడి విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అజేయ సెంచరీని నమోదు చేశాడు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.

దీంతో ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు కెప్టెన్‌గా రెండు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ (61 బంతుల్లో 111; 8 ఫోర్లు, 7 సిక్సులు)తో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్ (41 బంతుల్లో 43; 3 ఫోర్లు), లోకేశ్ రాహుల్ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, ఒక సిక్సు)తో రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు కలిసి తొలి వికెట్‌కి 123 పరుగులు జోడించారు. తొలి టీ20లో విఫలమైన ధావన్.. ఈ మ్యాచ్‌లో ఆచితూచి ఆడాడు.
భారీ షాట్లకు ప్రయత్నించకుండా రోహిత్ శర్మకు చక్కటి సహకారాన్ని అందించాడు. మరోవైపు రోహిత్ శర్మ విండిస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. మరోవైపు హాఫ్ సెంచరీకి చేరువైన ధావన్(43) పరుగుల వద్ద అల్లెన్ వేసిన 14వ ఓవర్ చివరి బంతికి పూరన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(5) పిర్రే బౌలింగ్2లో హెట్మేర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం లోకేశ్ రాహుల్, రోహిత్ శర్మ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ.. 61 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులతో 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేయడం విశేషం. విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ వేసిన ఈ ఓవర్‌లో రోహిత్ ఏకంగా 19 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో బ్రాత్‌వైట్ 20 పరుగులు సమర్పించుకున్నాడు.