
హైదరాబాద్: ఆంటిగ్వా వేదికగా భారత జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ విండీస్ బౌలర్లు చెలరేగుతున్నారు. 36 ఓవర్లకు గాను టీమిండియా 97/4 స్థితిలో నిలిచింది. ప్రస్తుతం రహానే(32), విహారి(1) పరుగులతో క్రీజులో ఉన్నారు.
లంచ్ విరామం అనంతరం ఓపెనర్ కేఎల్ రాహుల్ 97 బంతుల్లో 44(5 ఫోర్లు) వద్ద ఔటయ్యాడు. రహానేతో కలిసి నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తోన్న కేఎల్ రాహుల్‌ను ఔట్ చేయడంలో విండిస్ బౌలర్లు సఫలమయ్యారు. జట్టు స్కోరు 93 పరుగుల వద్ద రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో షాయ్ హోప్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అంతకుముందు కెప్టెన్ కోహ్లీ(9), మయాంక్ అగర్వాల్(5), పుజారా(2) నిరాశ పరిచారు. వర్షం అంతరాయం కలిగించడంతో అరగంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ విండీస్ బౌలర్లు టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడిని పెంచుతున్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండిస్
ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు టీమిండియా సిద్ధమైంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆంటిగ్వాలోని వివ్ రిచర్డ్స్ స్టేడియంలో వెస్టిండిస్‌తో తొలి టెస్టులో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
అంతకముందు స్టేడియం పరిసరాల్లో వర్షం పడటంతో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో టాస్ ఆలస్యమైంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా టీమిండియా తన సిరిస్‌ను విండిస్ పర్యటనతో ప్రారంభిస్తోంది. ఇప్పటికే వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా ప్రస్తుతం టెస్టు సిరీస్‌పై కన్నేసింది.
సొంతగడ్డపై వన్డే, టీ20 సిరీస్‌ని చేజార్చుకున్నా వెస్టిండిస్ కనీసం టెస్టు సిరీస్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే, తొలి టెస్టుకు ముందు గాయం కారణంగా ఆ జట్టు ఆల్ రౌండర్ కీమో పాల్ దూరమయ్యాడు.